టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే అరోపణలపై కేసు నమోదు చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. కేసులో చంద్రబాబు నాయుణ్ని A3గా చేర్చారు. చంద్రబాబుపై కేసు నమోదు చేసిన విషయాన్ని ఏసీబీ కోర్టుకు తెలిపారు. న్యాయస్థానంలో ఈ కేసుకు సంబంధించి విచారణ జరపాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టు పిటిషన్‌ను అనుమతించింది. ఎఫ్ఐఆర్ నంబర్ - 18/2023తో కేసు నమోదైంది.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో తమకు అనుకూలురైన రెండు బ్రేవరేజ్‌లు, మూడు డిస్టిలరీల నిర్వాహకులకు లబ్ధి చేకూర్చడానికి మద్యం పాలసీనే మార్చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఏ1గా ఐఎస్ నరేష్, ఏ2గా నాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఏ3 గా చంద్రబాబు నాయుడి పేర్లు నమోదు చేశారు. నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన బ్రేవరేజ్‌కి, మరొక బ్రేవరేజ్‌కి, 3 డిస్టిలరీలకి మేలు చేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పాలసీలో మార్పులు చేసినట్లు గుర్తించామని ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ పేర్కొంది. ఈ 5 మద్యం సంస్థలకు అనుకూలంగా 2012 ఎక్సైజ్ పాలసీని మార్చి, అనుమతులు ఇచ్చినట్లు పేర్కొంది.
క్విడ్ ప్రో కో తరహా అక్రమాలు..!
2012 నుంచి 2015 వరకు పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ. 2900 కోట్ల ఆదాయం రాగా.. 2015లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వానికి ఈ పన్నులు రాకుండా చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. టర్నోవర్‌పై నాటి ప్రభుత్వం 8 శాతం వ్యాట్ కాకుండా, అదనంగా 6 శాతం పన్నులు తీసివేసినట్లు గుర్తించామని తెలిపారు. 6 శాతం నుంచి 10 శాతానికి పన్నులు పెంచాలని కమిటీ సిఫార్సులు చేయగా.. చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేసిందని పేర్కొన్నారు. రెండు బ్రేవరేజీలు, మూడు డిస్టలరీలకు లబ్ధి చేకూర్చడానికి క్విడ్ ప్రోకో తరహా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ అంశాల్లో మరో రెండు కేసులు కూడా నమోదయ్యాయి. స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ వస్తుందని భావిస్తుండగా.. మరో కేసు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.