ప్రకాశం జిల్లాలో ఘరానా మోసం బయటపడింది. కొంతమంది వ్యక్తులు ఫకీర్ వేషంలో వచ్చి ముస్లిం మహిళలను మోసం చేసి డబ్బులు తీసుకెళ్ళిన ఘటన పొదిలిలో జరిగింది. పట్టణంలోని పడమటిపాలెం వీధిలో నివాసం ఉంటున్న షేక్ బషీర అనే మహిళ ఇంటి దగ్గరకు ఇద్దరు వ్యక్తులు ఫకీర్ వేషంలో వెళ్లారు. 'మీ ఇంట్లో చెడు సోకింది దువా చేయాలని, రూ11వేలు ఖర్చు అవుతుందని' చెప్పారు. వారి దగ్గర ఉన్న నెమలిఈకల విసనకర్రతో ఆ మహిళ తలపై మూడు సార్లు నిమిరాడు. దీంతో ఆమెకు మైకం వచ్చింది.. అనంతరం ఆమెను మోసం చేసి రూ.11వేలు తీసుకున్నారు. గమనించిన చుట్టుపక్కల వాళ్లు వెంటనే పోలీసులుకు సమాచారం అందించారు.. వారు గాలించి చిన్న బస్టాండు సెంటర్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు బషీరా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు మొత్తం ఐదుగురు ముఠా సభ్యులు వచ్చారని.. వీళ్లంతా కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. గాలి, ధూళి సోకిందని మాయమాటలు చెప్పి మోసం చేసే ముఠాల గురించి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు జనాలను హెచ్చరించారు.