దేశంలో మరోసారి ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే చర్చ జరుగుతోంది. ఇటీవల జీ20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇచ్చిన సమయంలో జీ 20 దేశాధినేతలకు పంపించిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాష్ట్రపతి కార్యాలయం ప్రచురించడంతో ఈ చర్చ ప్రారంభమైంది. ఆ తర్వాత జీ 20 దేశాధినేతల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కూర్చున్న టేబుల్‌పై ఉన్న నేమ్ ప్లేటుపై కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని రాసి ఉండటంతో ఇండియా పేరు స్థానంలో భారత్ అని తీసుకువచ్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా గూగుల్ మ్యాప్స్‌లో కూడా ఇండియా స్థానంలో భారత్ అని రావడం మరోసారి చర్చకు దారి తీసింది.
గూగుల్ మ్యాప్స్‌లో మన దేశాన్ని దక్షిణ ఆసియాలోని భారత్ అని చూపిస్తోంది. ఇందులో మన దేశ జాతీయ జెండా కూడా ఉంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రెండు రకాలుగా భారత్ అని సెర్చ్ చేసినా చూపించడం గమనార్హం. దీంతో గూగుల్ మ్యాప్స్‌లో భారత్, ఇండియా రెండు పేర్లలో ఏది సెర్చ్ చేసినా నెటిజన్లకు మన దేశ అధికారిక మ్యాప్ కనిపిస్తోంది. గూగుల్ మ్యాప్స్‌లోని సెర్చ్ బాక్స్‌లో భారత్ అని సెర్చ్ చేసి.. స్పేస్ ఇవ్వగానే పేరుతోపాటు జాతీయ జెండా కూడా దర్శనమిస్తోంది. అయితే ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్‌లో వచ్చిన మార్పులను చూస్తుంటే.. గూగుల్ కూడా ఇండియాను భారత్‌గా అంగీకరిస్తోందని తెలుస్తోంది. ప్రభుత్వం దేశం పేరు మార్చుతున్నట్లు వార్తలు వస్తుండగానే.. ఇప్పటికే దీనిపై గూగుల్ బ్యాక్ ఎండ్ వర్క్ ప్రారంభించినట్లు అర్థం అవుతోంది. అయితే ఇది ఒక్క గూగుల్ మ్యాప్స్‌లో మాత్రమే కాకుండా గూగుల్ కంపెనీకి చెందిన ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఇండియా, భారత్ అని సెర్చ్ చేస్తే కూడా ఒకే రకంగా సమాచారం వస్తోంది. గూగుల్ సెర్చ్, గూగుల్ ట్రాన్స్‌లేటర్, గూగుల్ న్యూస్ వంటి గూగుల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఇదే వివరాలు వస్తున్నాయి. అయితే దీనిపై గూగుల్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.