ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ మారుతున్న పరిస్థితులు.. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే మరిన్ని అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలోనే భారీ న్యూక్లియర్ బాంబ్‌ను తయారు చేయనున్నట్లు అమెరికా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. దానికి సంబంధించిన మరిన్ని వివరాలను కూడా పెంటగాన్ పేర్కొంది. ఆ బాంబు అత్యంత శక్తివంతమైందని.. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమాపై ప్రయోగించిన అణు బాంబు కంటే 24 రెట్లు అధిక విస్ఫోటనం కలిగి ఉంటుందని పెంటగాన్ తెలిపింది.
బీ 61 రకం కొత్త వేరియంట్ న్యూక్లియర్ గ్రావిటీ బాంబును తయారు చేసేందుకు సిద్ధమైనట్లు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ వెల్లడించింది. బీ 61-13 పేరుతో ఈ అణు బాంబును రూపొందిస్తున్నట్లు పేర్కొంది. నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో ఈ అణు బాంబును తయారు చేయనున్నట్లు తెలిపింది. అయితే ఈ బీ 61-13 అణు బాంబును తయారు చేయాలనే నిర్ణయం ఏదో అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని వివరించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ అణు బాంబును తయారు చేయడం అవసరమని గుర్తు చేసింది. అయితే ఈ అణు బాంబు తయారీకి సంబంధించిన అనుమతులు, కేటాయింపులు వంటివి అమెరికా చట్టసభ ముందు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రపంచంలో మరింత శక్తివంతంగా, సురక్షితంగా అమెరికా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు పెంటగాన్ వెల్లడించింది. ఈ అణు బాంబు సిద్ధమై తమ దేశ ఆయుధ శక్తిలో ఉంటే.. ప్రపంచంలోని ఏ దేశమైనా సవాలు చేయాలనుకునే వారికి కష్టం అవుతుందని పేర్కొంది. ఒకవైపు ప్రపంచంలో పెరుగుతున్న రష్యా దూకుడు.. మరోవైపు 2030 నాటికి వెయ్యికిపైగా అణ్వాయుధాలను చైనా సిద్ధం చేసుకుంటోందనే వార్తలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ భారీ అణు బాంబును తయారు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించడం సంచలనంగా మారింది.
జపాన్‌లోని హిరోషిమాపై 1945 ఆగస్టులో రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబును ప్రయోగించింది. ఆ అణు బాంబు సుమారు 15 కిలో టన్నుల శక్తిని విడుదల చేసింది. ఇక నాగసాకిపై పడిన బాంబు సామర్థ్యం 25 కిలో టన్నులు. కానీ ప్రస్తుతం అమెరికా తయారు చేస్తామని ప్రకటించిన బీ 61-13 అణు బాంబు ఏకంగా 360 కిలో టన్నుల శక్తిని ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే హిరోషిమాపై ప్రయోగించిన దానికంటే 24 రెట్లు అధికమని నిపుణులు చెబుతున్నారు.