ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాజాపై మూడు వారాలుగా ఇజ్రాయేల్ భీకర దాడులు,,,చైనాప్రపంచ మ్యాప్‌ల నుంచి ‘ఇజ్రాయేల్’ మాయం

international |  Suryaa Desk  | Published : Tue, Oct 31, 2023, 09:24 PM

హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయేల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన కంపెనీలు చర్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అలీబాబా, బైడు కంపెనీలు తమ ఆన్‌లైన్‌ డిజిటల్‌ ప్రపంచ మ్యాప్‌లో మార్పులు చేశాయి. కొత్త మ్యాప్‌ల్లో ఇజ్రాయేల్‌ మాయం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ మ్యాప్‌లలో అంతర్జాతీయ సరిహద్దులు, పాలస్తీనా భూభాగాలను పేర్కొన్న ఈ సంస్థలు.. ఆ ప్రాంతం వద్ద ఇజ్రాయేల్ పేరును మాత్రం పేర్కొనకపోవడం గమనార్హం. మ్యాపుల్లో లగ్జెంబర్గ్‌ లాంటి చిన్న చిన్న దేశాలను కూడా స్పష్టంగా పేర్కొన్నారు. కానీ, ఇజ్రాయేల్‌ పేరును పక్కనబెట్టేశాయి. అంతేకాదు, ఇజ్రాయేల్‌కు బదులుగా మరో పేరును కూడా చేర్చకుండా అంతర్జాతీయ సరిహద్దులతో ఆ ప్రదేశాన్ని ఖాళీగా చూపించాయి. ఇజ్రాయేల్‌ పేరు లేని ఈ డిజిటల్‌ మ్యాప్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అంశాన్ని అమెరికాకు చెందిన ‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ తమ కథనంలో తొలుత ప్రస్తావించింది. ఆ తర్వాత పలు అంతర్జాతీయ పత్రికలు వార్తలను ప్రచురించాయి.


కానీ, ఇజ్రాయేల్‌ పేరును మ్యాప్ నుంచి తొలగించడానికి గల కారణాలను మాత్రం అలీబాబా, బైడు సంస్థలు వెల్లడించలేదని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం పేర్కొంది. అయితే, గాజాలో దాడులను చైనా వ్యతిరేకిస్తున్న వేళ.. ఈ మ్యాప్‌లు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. అక్టోబరు 7న ఇజ్రాయేల్‌పై మెరుపుదాడి చేసిన హమాస్ మిలిటెంట్లు.. సరిహద్దుల్లోని ప్రాంతాలపై చొరబడి నరమేధానికి పాల్పడ్డారు. అయితే, మారణకాండను బహిరంగంగా ఖండించని చైనా.. పౌరుల భద్రత కోసం ఇరు వర్గాలు శాంతిని పునరుద్ధరించాలని ఆ తర్వాత ప్రకటన చేసింది. చైనా తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తడంతో డ్రాగన్ యూటర్న్ తీసుకుంది. ఇజ్రాయేల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉందని, కానీ, అది అంతర్జాతీయ మానవతా చట్టాలకు లోబడి ఉండాలని సన్నాయి నొక్కులు నొక్కింది.


అమెరికా పర్యటనకు వెళ్తూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ.. ఇజ్రాయేల్‌ విదేశాంగ మంత్రితో ఫోన్‌కాల్‌లో మాట్లాడారు. ‘ఇజ్రాయేల్‌కు తమ దేశాన్ని రక్షించుకునే హక్కు ఉంది.. కానీ, అది అంతర్జాతీయ మానవతా చట్టాల పరిధికి లోబడి మాత్రమే ఉండాలి’ అని చైనా సూచించారు. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా మార్చడమే.. ఈ యుద్ధానికి ఏకైక పరిష్కారమని ఇటీవల డ్రాగన్‌ పునరుద్ఘాటించింది. కాగా, గాజాపై ఇజ్రాయేల్ దాడులను తక్షణమే ఆపాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గతవారం పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఈజిప్ట్, ఖతార్ సహా ఇతర అరబ్ దేశాలతో సమన్వయం చేసుకుని.. వీలైనంత త్వరగా పాలస్తీనా సమస్యకు సమగ్రమైన, న్యాయపరమైన, శాశ్వత పరిష్కారం కోసం ముందుకు రావాలని చైనా అధినేత పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com