ప్రతిష్టాత్మకమైన ఐసీఐడీ సదస్సును విశాఖలో నిర్వహించడం గర్వకారణమని సీఎం జగన్ పేర్కొన్నారు. సదస్సు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకోవడం శుభపరిణామమన్నారు. సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతినిధులందరికీ స్వాగతం పలికారు. ఏపీలో సాగునీటి రంగం, వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. రాష్ట్రానికి విస్తారమైన తీర ప్రాంతం ఉందన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరువు వస్తోందన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టుకోవడమే లక్ష్యమన్నారు. వర్షం కురిసేది తక్కువ కాలమే..ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి ఉపయోగించుకోవాలన్నారు. సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.