న్యాయ విచారణలో లాయర్లు పదే పదే ‘మై లార్డ్’ ‘యువర్ లార్డ్‌షిప్స్’ అని సంబోధించడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఆ పదాన్ని వాడుతారని అసహనానికి గురయ్యారు. అంతేకాదు, ఆ పదాన్ని వాడటం మానేస్తే నా జీతంలో సగం ఇస్తానని లాయర్‌కు ఆఫర్ ఇచ్చారు. బుధవారం ఓ కేసు విచారణ సందర్భంగా ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ ఈ విధంగా స్పందించారు. జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ నరసింహల ధర్మాసనం ముందుకు ఓ కేసు విచారణకు రాగా.. ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు.
కాగా, కోర్టు విచారణ సమయంలో న్యాయమూర్తులను ‘మై లార్డ్’ లేదా ‘యువర్ లార్డ్‌షిప్స్’ అని సంబోధిస్తారు. తరుచూ ఆ సంప్రదాయాన్ని వ్యతిరేకించే వారు దీనిని వలసవాద కాలం నాటి అవశేషాలు, బానిసత్వానికి చిహ్నంగా పిలుస్తారు. ఈ నేపథ్యంలో న్యాయవాది పదే పదే మై లార్డ్ అని సంబోధించడంతో జస్టిస్ నరసింహ విసుగు చెందారు. దీంతో ‘మైలార్డ్‌కు బదులుగా మీరు ‘సార్'’ అని ఎందుకు సంబోధించకూడదు’అని జస్టిస్ నరసింహ అన్నారు. లేకపోతే సీనియర్ న్యాయవాది ‘మై లార్డ్స్’ అనే పదాన్ని ఎన్నిసార్లు పలికారో లెక్కించడం ప్రారంభిస్తానని అన్నారు. అంతేకాదు, ఈ పదాన్ని ఉపయోగించడం మానేస్తే నా జీతంలో సగం ఇస్తానని వ్యాఖ్యానించారు.
కాగా, 2006 ఏప్రిల్‌లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ న్యాయవాది న్యాయమూర్తులను ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్‌షిప్’ అని సంబోధించకూడదని నిర్ణయించే తీర్మానాన్ని ఆమోదించింది. అయితే అది ఆచరణలో మాట్రం పాటించడం లేదు. సర్వోన్నత న్యాయస్థానం, హైకోర్టుల న్యాయమూర్తులను యువర్ లార్డ్‌షిప్ లేదా మై లార్డ్ అండ్ యువర్ లేడీషిప్ లేదా మై లేడీ అని సంబోధిస్తారు. ఇది నేరుగా ఇంగ్లాండ్‌కు సంబంధించిన సంప్రదాయం. ఈ నేపత్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీనిపై ఒక తీర్మానాన్ని ఆమోదించింది. న్యాయవాదుల చట్టంలో కొత్త నిబంధన 49(1)(j)ని జోడించింది. దీని ప్రకారం.. న్యాయవాదులు యువర్ ఆనర్ అని సంబోధించవచ్చు. అదే సబార్డినేట్ కోర్టు అయితే.. లాయర్లు సంబంధిత ప్రాంతీయ భాషలో సర్ లేదా ఏదైనా సమానమైన పదబంధాన్ని ఉపయోగించవచ్చు. ఈ చర్య వెనుక ఉన్న కారణాన్ని బార్ కౌన్సిల్ వివరిస్తూ.. మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్ వంటి పదాలు వలస పాలన అవశేషాలు అని పేర్కొంది. కోర్టు పట్ల గౌరవప్రదమైన వైఖరిని చూపుతూ పై నియమాన్ని చేర్చాలని ప్రతిపాదించింది.
అక్టోబరు 2009లో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ కె చంద్రూ దీనిని అపూర్వమైన చర్యగా పేర్కొన్నారు. న్యాయవాదులు తన కోర్టును మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్ అని సంబోధించకుండా నిషేధించారు. కాగా, 2014లో ఒక సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టులో వీటిని నిషేధించాలని కోరుతూ పిల్ దాఖలు చేశారు. అయితే, జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ ఎస్‌ఎ బోబ్డేల ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది.