గాజా స్ట్రిప్‌లో హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయేల్ సైన్యం మధ్య జరుగుతోన్న యుద్ధంలో భారత సంతతికి చెందిన సైనికుడు అమరుడయ్యాడు. గివాటీ బ్రిగేడ్‌లోని భారత సంతతికి చెందిన స్టాఫ్ సార్జెంట్ హాలేల్ సోలమన్ (20) హమాస్‌తో పోరాడుతూ ప్రాణాలు వదిలినట్టు ముంబయిలోని ఇజ్రాయేల్ కాన్సుల్ జనరల్ కొబ్బి షోషానీ వెల్లడించారు. ఇజ్రాయేల్‌లోని డిమోనాకు చెందిన సోలమన్ సహా మరో 17 మంది మృతిచెందినట్టు తెలిపారు. భారత సంతతి సైనికుడి మరణంపై డిమోనా మేయర్ బెన్నీ బిట్టన్ ఫేస్‌బుక్‌లో సంతాపం తెలియజేశారు. గాజాలో జరిగిన యుద్ధంలో డిమోనా పౌరుడు హాలెల్ సోలమన్ మరణించినట్లు ప్రకటించడం చాలా విచారం.. దుఃఖంగా ఉంది.. హాలేల్ ఒక అర్ధవంతమైన సేవ చేయాలని ఆకాంక్షించాడు.. గివాటి బ్రిగేడ్‌లో చేరాడు. హలేల్ అంకితభావం కలిగిన యువకుడు.. అతని దృష్టిలో ఎల్లప్పుడూ తల్లిదండ్రుల పట్ల అపారమైన గౌరవం.. మంచి లక్షణాలు కలిగిన సైనికుడు.. అతను అంతులేని త్యాగం, వినయం, వినయాన్ని విశ్వసించాడు. అతడి మృతితో మొత్తం నగరం విషాదంలో మునిగిపోయింది’ అని మేయర్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు
సోలమన్ మృతిపై ఇజ్రాయేల్‌లో భారతీయ సమాజం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ‘అతడు ఆహ్లాదకరమైన, ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడు.. ఇజ్రాయేల్ అస్థిత్వం కోసం న్యాయమైన యుద్ధంలో పోరాడుతున్న ఇతర యువ ఇజ్రాయెలీల ప్రాణాలు కోల్పోవడం బాధాకరం’ పేర్కొంది. ఇక, హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఇజ్రాయేల్ సైనికుల వివరాలను బుధవారం వెల్లడించారు. ఈ సమాచారాన్ని వారి కుటుంబసభ్యులకు తెలియజేశారు. మరోవైపు, భూతల యుద్ధం కొనసాగిస్తున్న ఇజ్రాయేల్ సైన్యం.. గాజా నగరాన్ని పూర్తిగా ముట్టడించింది. హమాస్‌ను అంతం చేయడమే తమ లక్ష్యమని, అప్పటి వరకూ దాడులను ఆపబోమని ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు పునరుద్ఘాటించారు. దాదాపు నాలుగు వారాలుగా జరుగుతోన్న యుద్ధంలో 9 వేల మందికిపైగా పాలస్తీనా పౌరులు చనిపోయారు. వేలాది మంది గాయపడ్డారు.