ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత పోలింగ్ ఈ నెల 7 వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ రాష్ట్ర సీఎం, కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి సీఎం భూపేష్ బఘేల్‌కు రూ. 508 కోట్ల చెల్లింపులు జరిగాయని ఈడీ అధికారులు పేర్కొన్నారు. రూ.5 కోట్లతో పట్టుబడిన ఓ కొరియర్ ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు తీగ లాగడంతో డొంక అంతా కదలింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్‌కు చెందిన ప్రమోటర్లు సీఎం భూపేష్ బఘేల్‌కు రూ. 508 కోట్లు చెల్లింపులు చేసినట్లు ఆ కొరియర్ చెప్పాడని ఈడీ అధికారులు పేర్కొన్నారు. తన వద్ద ఉన్న డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు భూపేశ్ బఘేల్‌కి డెలివరీ చేయడానికి ఉద్దేశించినట్లు ఆ కొరియర్ అసిమ్ దాస్ ఈడీ ముందు చెప్పాడని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ తొలి దశ ఎన్నికలకు 4 రోజుల ముందు ఈ ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఈ క్రమంలో మహాదేవ్ బెట్టింగ్ నెట్‌వర్క్ స్కాం నిందితుల్లో ఒకరైన శుభమ్ సోనీ.. అసిమ్ దాస్‌కు పంపిన ఈ మెయిల్‌ను పరిశీలించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఆ ఈ మెయిల్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. గతంలో జరిగిన చెల్లింపులకు సంబంధించిన కీలక సమాచారం కూడా సదరు మెయిల్‌లో ఉన్నట్లు తెలిపింది. అలాగే మహాదేవ్ యాప్ ప్రమోటర్లు.. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్‌కు దాదాపు రూ.508 కోట్లు చెల్లించినట్లుగా ఈడీ సంచలన ప్రకటన చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని హోటల్ ట్రిటాన్, భిలాయ్‌లోని మరో ప్రదేశంలో గురువారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 5.39 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. మహదేవ్ బెట్టింగ్ యావ్ నిర్వాహకులు విదేశాల్లో ఉంటూ ఛత్తీస్‌గఢ్‌లోని తన సన్నిహితులతో బెట్టింగ్ సిండికేట్ నడుపుతున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ నలుగురిని అరెస్ట్ చేసింది. ఈ మహాదేవ్ యాప్ బెట్టింగ్ కేసులో ఈడీ ఇటీవలే తొలి ఛార్జిషీట్ దాఖలు చేయగా.. ఇందులో యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ సహా 14 మందిని నిందితులుగా చేర్చింది.