అమెరికాలో దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన తెలుగు విద్యార్ధి వరుణ్ రాజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుచ్చా రామ్మూర్తి కుమారుడు వరుణ్ ఇండియానాలో ఎంఎస్ చదువుతున్నాడు. అక్టోబరు 30న ఇండియానాలో జిమ్ నుంచి బయటకు వస్తున్న వరుణ్‌పై అకస్మాత్తుగా ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన రక్తపు మడుగులో పడి ఉన్న వరుణ్‌ను పోలీసులు ఆస్ప త్రికి తరలించారు. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉంది. తాజాగా, ఈ ఘటనపై స్పందించిన అమెరికా.. తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
‘భారతీయ విద్యార్ధి వరుణ్ రాజ్.. పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. దర్యాప్తు కొనసాగుతున్న ఈ కేసుకు సంబంధించిన సందేహాల కోసం మేము స్థానిక అధికారులను అడిగి తెలుసుకుంటాం’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. నిందితుడ్ని అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు. అంతేకాదు, ఈ ఘటన అత్యంత బాధాకరమని అన్నారు. వరుణ్ రాజ్ దాడి గురించి అమెరికాలో నివసిస్తున్న వారి బంధువు సాయివర్ధన్ ఖమ్మంలోని అతడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. నిందితుడు ఆండ్రేడ్ జోర్డాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, తాము అమెరికా వెళ్లేందుకు సహకరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వరుణ తల్లిదండ్రులు కోరుతున్నారు. గత ఫిబ్రవరిలోనూ ఓ ఖమ్మం విద్యార్థి అమెరికాలో చనిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు, వరుణ్ దాడి ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. అక్కడ అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని ఆయన చెప్పారు. కాగా, అమెరికాలో భారతీయ విద్యార్థులు, భారత సంతతి వ్యక్తులపై దుండుగులు తరుచూ దాడులకు తెగబడుతున్నారు. ఈ ఘటనల్లో పలువురు ప్రాణాలను కూడా కోల్పోయారు.