హమాస్ నియంత్రణలో ఉన్న గాజా నగరాన్ని తమ బలగాలు పూర్తిగా చుట్టుముట్టాయని, మిలిటెంట్ల సమూహంపై దాడిని మరింత ముమ్మరం చేశాయని ఇజ్రాయేల్ సైన్యం ప్రకటించింది. హమాస్ ఉగ్రవాద సంస్థకు కేంద్రంగా ఉన్న గాజా నగరాన్ని ఇజ్రాయేల్ దళాలు పూర్తిగా దిగ్భంధనం చేశాయి.. కాల్పులు విరమణ విషయంలో వెనక్కి తగ్గే ఆలోచన లేదు’ అని ఇజ్రాయేల్ సైనిక అధికార ప్రతినిధి డానియల్ హగరీ వెల్లడించారు. దీనిపై హమాస్ కూడా ఘాటుగా స్పందించింది. గాజాలోకి వచ్చిన ఇజ్రాయేల్ సైనికుల శవాలను బ్యాగులో పార్శిల్ చేసి పంపుతామని శపథం చేసింది. ఇజ్రాయేల్ అక్టోబరు 7న ఇజ్రాయేల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడులకు పాల్పడి.. సరిహద్దుల్లో మారణకాండకు తెగబడింది. దీంతో హమాస్‌పై గత నాలుగు వారాలుగా ఇజ్రాయేల్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. అయితే, యుద్ధానికి తాత్కాలికంగా విరామం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
మధ్య ఆసియాలో పర్యటిస్తోన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ.. ‘మేము గాజాలో మహిళలు, పిల్లలు సహా సాధారణ పౌరులకు హానిని తగ్గించడానికి తీసుకోవలసిన నిర్దిష్ట చర్యల గురించి మాట్లాడుతాం’ అని చెప్పారు. రఫా సరిహద్దుల నుంచి పౌరులను ఈజిప్టు అనుమతించడంతో వందల మంది అక్కడ నుంచి బయటపడుతున్నారు. బుధవారం ఈ సరిహద్దు నుంచి పౌరులను అనుమతిస్తుండగా.. గురువారం గాయాలతో ఉన్న 21 మంది పాలస్తీనియన్లు, 72 మంది చిన్నారులు సహా 344 మంది విదేశీయులు ఈజిప్టులోకి వచ్చినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, ఇప్పటి వరకూ ఇజ్రాయేల్ జరిపిన దాడుల్లో 9,061 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, వీరిలో 3,760 మంది చిన్న పిల్లలే ఉన్నారని గాజాలోని హమాస్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. ఇజ్రాయేల్ దాడులను ఐక్యరాజ్యసమతి తీవ్రంగా ఖండిస్తోంది. ఘోరమైన దాడులు యుద్ధ నేరాలకు సమానం అని ఐరాస పేర్కొంది. ‘జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయేల్ వైమానిక దాడుల తర్వాత అధిక సంఖ్యలో పౌర మరణాలు, విధ్వంసం స్థాయిని పరిగణనలోకి తీసుకుంటే, ఇవి యుద్ధ నేరాలకు దారితీసే అసమాన దాడులు అని మేము తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం’ అని ఐరాస మానవ హక్కుల కార్యాలయం తెలిపింది. ఇజ్రాయెల్ దాడులతో గాజా నగరంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజులుగా శరణార్థి శిబిరాలపైనా దాడులు జరుగుతుండటంతో గాజాలో సురక్షిత ప్రాంతమనేదే కరవైందని ఐరాస ఆవేదన వ్యక్తం చేసింది. అక్టోబరు 7 నుంచి జరుగుతున్న దాడుల్లో ఇప్పటి వరకూఐరాస సహాయక బృందాలకు చెందిన 70 మంది చనిపోయారని పేర్కొంది.