దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి ఎంతో మంది పోరాటం చేశారు. అయితే స్వాతంత్యం వచ్చిన తర్వాత స్వాతంత్య్ర సమరయోధులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తోంది. అయితే కొందరు దేశానికి స్వాతంత్య్రం తెచ్చినా పెన్షన్ మాత్రం అందుకోకుండా తీవ్ర దుర్భర పరిస్థితులను అనుభవించి చనిపోయినవారు.. ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. అయితే తాజాగా ఓ స్వాతంత్య్ర సమరయోధుడు.. కోర్టు మెట్లు ఎక్కి 4 దశాబ్దాల పాటు పోరాటం చేసి చివరికి విజయం సాధించాడు. ఆ 96 ఏళ్ల వృద్ధుడి అభ్యర్థనను విన్న ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వంపై తీవ్రంగా స్పందించింది. దేశం కోసం పోరాడిన ఓ స్వాతంత్ర్య సమరయోధుడికి పెన్షన్ ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంపై భారీ జరిమానా విధించింది.
బిహార్‌కు చెందిన 96 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు ఉతిమ్ లాల్ సింగ్.. తనకు పెన్షన్ ఇవ్వాలని 40 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపి కీలక తీర్పు వెలువరించింది. ఉతిమ్ లాల్ సింగ్కు పెన్షన్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అవమానించిందని ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆయనకు రావాల్సిన పెన్షన్ బకాయిలను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 1980 ఆగస్టు 1 నుంచి ఇప్పటి వరకు రావాల్సిన అన్ని పెన్షన్ బకాయిలను చెల్లించాలని తేల్చి చెప్పింది. 12 వారాల్లోగా బాధితుడు ఉతిమ్ లాల్ సింగ్‌కు చెల్లించాలని పేర్కొంది. ఏడాదికి 6 శాతం వడ్డీ కూడా చెల్లించాలని స్పష్టం చేసింది. ఇక ఉతిమ్ లాల్ సింగ్కు పెన్షన్ ఇవ్వకుండా అలసత్వం వహించిన కేంద్ర ప్రభుత్వానికి రూ.20 వేలు జరిమానా విధిస్తూ.. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ తుది తీర్పు వెలువరించారు.
ఈ ఉతిమ్ లాల్ సింగ్ కేసును బిహార్ ప్రభుత్వం.. ఢిల్లీ హైకోర్టుకు పంపించింది. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్.. ఉతిమ్ లాల్ సింగ్కు పెన్షన్ ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు పెన్షన్ ఇవ్వాలని జిల్లా మెజిస్ట్రేట్ ధ్రువీకరించినా.. ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ఇది పెన్షన్ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని అభిప్రాయపడింది. ఉతిమ్ లాల్ సింగ్ పట్ల కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరమని పేర్కొంది.
బ్రిటీష్ వారి నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు జరిగిన పోరాటంలో బిహార్కు చెందిన ఉతిమ్ లాల్ సింగ్ చాలా చురుగ్గా పాల్గొన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారని.. ఈ క్రమంలోనే ఆయనపై అనేక కేసులు పెట్టి బ్రిటిష్ ప్రభుత్వం జైలుకు కూడా పంపించిందని పేర్కొంది. విచారణ సందర్బంగా ఉతిమ్ లాల్ సింగ్ భూమిని కూడా జప్తు చేసిందని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa