ఏ కంపెనీకైనా, సంస్థకైనా అందులో పనిచేసే సిబ్బంది, ఉద్యోగులే వెన్నముక లాంటివారు. తమ వద్ద పనిచేస్తూ.. సంస్థను అభివృద్ధి పథంలో భాగమైన ఉద్యోగులకు యజమానులు.. వేతనాల పెంపులు, గిఫ్ట్‌లు, ప్రోత్సాహాలు ఇచ్చి మరింత పనిచేసేలా చూస్తుంటారు. అయితే సాధారణంగా దీపావళి సందర్భంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు బోనస్‌లు ఇస్తుంటాయి. ఈ క్రమంలోనే ఓ కంపెనీ తన ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. దీపావళి బహుమతుల కింద రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లను అందించింది.
తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారి.. తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు దీపావళి బోనస్గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను ఇచ్చారు. ఆ కంపెనీలో పనిచేసే డ్రైవర్ నుంచి మేనేజర్ వరకు అన్ని స్థాయిల వారికీ ఈ దీపావళి గిఫ్ట్‌లను ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. దీపావళి సందర్భంగా తమ యజమాని ఖరీదైన బహుమతులు ఇవ్వడం పట్ల ఉద్యోగులు ఆనందంలో మునిగిపోయారు. తమిళనాడు తిరుప్పుర్కు చెందిన శివకుమార్ అనే వ్యాపారి కోటగిరి ప్రాంతంలో దాదాపు 20 ఏళ్లుగా నివసిస్తున్నారు. అక్కడే కొంత ప్రాంతాన్ని కొనుగోలు చేసి పంటలు పండిస్తున్నాడు. తన ఎస్టేట్‌లో క్యాలీఫ్లవర్, క్యారెట్, బీట్రూట్, స్ట్రాబెర్రీ సహా వివిధ రకాల కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నారు.
అయితే ప్రతీ దీపావళికి అతని ఎస్టేట్‌లో పనిచేసే ఉద్యోగులకు శివకుమార్ బహుమతులు ఇచ్చేవాడు. ఈ క్రమంలోనే ఈసారి కూడా గిఫ్ట్‌లు అందించాడు. తన కంపెనీలో పనిచేసే 15 మంది డ్రైవర్ నుంచి మేనేజర్ స్థాయి వరకు ఉద్యోగులకు వారికి నచ్చిన బైక్‌లను కొనిచ్చాడు. ఈసారి తన ఉద్యోగుల్లో 15 మందిని ఎంపిక చేశారు. ఈ బైక్‌లలో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, యమహా రే స్కూటర్ మోడల్స్ ఉన్నాయి. ముందుగా 15 బైక్లను బుక్ చేసి ఆ తర్వాత వాటిని ఉద్యోగులకు ఇచ్చి శివకుమార్ సర్ప్రైజ్ చేశారు.
దీపావళి సందర్భంగా తమ యజమాని ఇచ్చిన ఈ ఊహించని సర్ప్రైజ్‌ను చూసి ఆ ఉద్యోగులు ఆనందంలో మునిగిపోయారు. అయితే ఇలా దీపావళి గిఫ్ట్‌లు ఇవ్వడంపై శివకుమార్ స్పందించారు. తన కోసం కష్టపడి పనిచేసే ఉద్యోగులను సంతోషంగా ఉంచాలని భావించినప్పుడు.. వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పాడు. అందులో భాగంగా సంస్థ తరఫున వారికి వసతి, వారి పిల్లలకు వైద్యం, విద్య వంటివి కూడా అందిస్తున్నామని పేర్కొన్నాడు. వీటితోపాటు తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెడుతున్నట్లు వివరించాడు.
ఈ సందర్భంగా మిగిలిన ఇతర వ్యాపారులకు కూడా పలు సూచనలు చేశారు. కంపెనీగానీ, యజమాని గానీ మంచి స్థాయిలో ఉండటానికి కారణం అందులో పనిచేసే ఉద్యోగులేని.. అందుకే యజమానులు వారి ఉద్యోగులను సంతోషంగా ఉంచాలని.. వారి అవసరాలను తీర్చాలని పేర్కొన్నారు. దాంతో వ్యాపారం వృద్ధి చెందడంతోపాటు ఉద్యోగుల జీవితాలు కూడా మెరుగుపడతాయని తెలిపాడు.