దేశ రాజధాని ఢిల్లీ నగరంపై కాలుష్యం పడగవిప్పడంతో గాలి విషతుల్యంగా మారిపోయింది. గత నాలుగు రోజులుగా వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో నమోదవుతోంది. శనివారం ఉదయం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 504కి చేరింది. జహంగీర్‌పురి ప్రాంతంలో ఏకంగా 700 దాటేయగా.., సోనియా విహార్‌లో 618కి పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గాలిలో విషవాయువుల గాఢత (పీఎం) 2.5 స్థాయిలో ఉండటం ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాల కంటే 80 రెట్లు అధికం. ఈ గాలిని పీల్చితే తీవ్ర ఆనారోగ్యానికి గురికావడంతో పాటు కంటి దురద, శ్వాసకోశ సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రి సీనియర్ వైద్యులు డాక్టర్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. ‘వాయు కాలుష్యానికి అన్ని వయసుల వారూ తీవ్రంగా ప్రభావితం అవుతారు.. కడుపులో ఉండే బిడ్డను కూడా ప్రభావితం చేస్తుంది.. ఆ బిడ్డ శ్వాస తీసుకోనందున పుట్టబోయే బిడ్డ ఎలా ప్రభావితమవుతుందని ఆశ్చర్యపోవచ్చు.. తల్లి ఊపిరి పీల్చుకున్నప్పుడు, విషతుల్యాలు ఆమె ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి.. అక్కడ నుంచి అవి రక్తంలోకి.. మావి ద్వారా అవి బిడ్డకు, పిండానికి చేరుకుని హాని కలిగిస్తాయి... బిడ్డ పుట్టినప్పుడు వారు అదే గాలిని పీల్చుకుంటారు... ఢిల్లీలో గాలి నాణ్యత దాదాపు 450–500 ఉంటుంది. ఇది శరీరానికి హాని కలిగించే విషయంలో దాదాపు 25–30 సిగరెట్లకు సమానం... వారికి అన్ని రకాల శ్వాస సమస్యలు ఉన్నాయి’ అని చెప్పారు. కాగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించారు. రెండు వారాలపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం, అత్యంత ప్రతికూల వాతావరణ కారణంగా ఢిల్లీలో ఈ పరిస్థితి నెలకుంది.