హిమాలయ దేశం నేపాల్‌ను మరోసారి భూకంపం వణికించింది. ఆదివారం తెల్లవారుజామున రిక్టర్ స్కేల్‌పై 3.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. రాజధాని కఠ్మాండూకు వాయువ్య దిశలో 169 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. శుక్రవారం రాత్రి జాజర్‌కోట్ జిల్లాలో భూకంపం విరుచుకుపడి విలయం సృష్టించింది. ఇప్పటి వరకూ 160 మంది మృతి చెందగా.. వందలాది మంది గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి సంభవించిన తీవ్రత ఉత్తర భారతాన్ని కూడా తాకింది. భారత్‌లోని పలు ప్రాంతాలు కంపించాయి. ఢిల్లీపాటు యూపీ, బిహార్‌లలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జాజర్‌కోట్ జిల్లాలో తొలుత 6.4 తీవ్రతతో శుక్రవారం రాత్రి 11.50 గంటలకు భూకంపం చోటుచేసుకుంది. అనంతరం కొద్ది గంటల్లోనే 4.2 తీవ్రతతో మరో భూకంప రామిదండాలో నమోదయ్యింది. తాజాగా, ఆదివారం తెల్లవారుజామున భూమి కంపించడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
కాగా, హిమాలయ పర్వత దేశం తరచుగా భూకంపాలకు గురవుతుంది. చివరి అతిపెద్ద విపత్తు 2015లో జరిగింది. ఏప్రిల్ 25, 2015 నాటి భూకంపంలో 9,000 మంది మరణించారు. చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు ధ్వంసమయ్యాయి, మొత్తంగా ఒక మిలియన్ ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ ఘటన వల్ల నేపాల్ ఆర్థిక వ్యవస్థకు 6 బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లింది. 1934లో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపాన్ని మించి ప్రాణనష్టం జరిగింది. అప్పట్లో కనీసం 8,519 మంది ప్రాణాలను బలిగొంది. ఈ భూకంపం భారతదేశంపై కూడా ప్రభావం చూపింది.
జాజర్‌కోట్‌లో సహాయక చర్యలు కష్టంగా మారాయి. కొండచరియలు విరిగిపడి మార్గం మూసుకుపోవడంతో కొన్నిచోట్లకు అధికారులు చేరుకోలేకపోయారు. నేపాల్‌లో 2015లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం ఆ తర్వాత పెద్దవిపత్తు ఇదే. ఘటనల్లో రుకమ్ జిల్లాలో 35 మంది, జజర్‌కోట్‌లో డిప్యూటీ మేయర్ సహా 34 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం నాటి భూకంపానకి ఆ రెండు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. శనివారం సాయంత్రం వరకు 159 సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. వీటిలో ఒకటి రామిదండాలో 4.2 తీవ్రతతో ఉంది. వైద్య బృందంతో కలిసి నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ.. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన తిరుగు ప్రయాణంలో ఏడుగురు క్షతగాత్రుల్ని తన హెలికాప్టర్‌లో కాఠ్‌మాండూకు తీసుకువచ్చారు.