నరేంద్ర మోదీ. ఈ పేరు కేవలం భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. 2014 లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ భారత విదేశాంగ విధానంలో కొత్త ఒరవడి సృష్టించారు. ఇక విదేశాల్లో కంటే స్వదేశంలో తన ఛరిష్మాను విపరీతంగా పెంచుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. బీజేపీ గెలుపుకు దిక్సూచిగా మారారు. అయితే దేశంలో ఎంతో మంది యువ నాయకులకు స్ఫూర్తిగా ప్రధాని మోదీ నిలిచారు. ఇక తాజాగా ఓ మహిళ.. నరేంద్ర మోదీపై పీహెచ్‌డీ చేశారు. 8 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పరిశోధనలు చేసి తాజాగా డాక్టరేట్ పొందారు.
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసికి చెందిన నజ్మా పర్వీన్ ప్రధాని నరేంద్ర మోదీపై పీహెచ్‌డీ పూర్తి చేసింది. ప్రధాని మోదీపై 2014 లో పరిశోధనలు ప్రారంభించిన నజ్మా పర్వీన్.. 8 ఏళ్ల పాటు సుదీర్ఘంగా అధ్యయనం చేశారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఆమె ఈ పీహెచ్‌డీ చేశారు. ప్రొఫెసర్ సంజయ్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో నజ్మా పర్వీన్ ప్రధాని నరేంద్ర మోదీపై పరిశోధనలు పూర్తి చేశారు. అయితే ఆమెకు ఇటీవలె డాక్టరేట్ పట్టా అందింది.
తనకు పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్‌లో భాగంగా పీహెచ్‌డీ చేసేందుకు ఒక రాజకీయ నాయకుడిని ఎంచుకోవాల్సి వచ్చిందని నజ్మా పర్వీన్ తెలిపారు. అయితే 2014 లో తాను ప్రధాని నరేంద్ర మోదీని ఎంచుకున్నట్లు నజ్మా వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిన నజ్మా పర్వీన్.. ఆయన ఏ మతానికో, కులానికో కాకుండా దేశం మొత్తానికి ప్రధానమంత్రి అని తెలిపారు. నరేంద్ర మోదీ జీవితం తనను ఎంతో ఆకట్టుకుందని.. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన రాజకీయ నేతగా మోదీ తనకు కనిపించారని పేర్కొన్నారు.
‘నరేంద్ర మోదీ రాజకీయ నాయకత్వం - ఒక విశ్లేషణాత్మక అధ్యయనం’ పేరుతో తన పీహెచ్‌డీ పరిశోధనలను 2014 లో మొదలు పెట్టినట్లు నజ్మా పర్వీన్ మీడియాకు వెల్లడించారు. 2023 నవంబరు 1 వ తేదీ నాటికి ఈ పరిశోధనలు పూర్తయిందని తెలిపారు. ఈ పరిశోధనలో భాగంగా మొత్తం 5 అధ్యాయాలు ఉన్నాయని చెప్పారు. అధికారం నుంచి విముక్తి, కాంగ్రెస్ వంశ పాలన, ప్రధాని మోదీ రాజకీయ జీవితం, గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ పనితీరు, ప్రతిపక్షాల ఆరోపణలు-విమర్శల కాలం, ప్రజలు- మీడియా మద్దతు అనే 5 అంశాలను తీసుకున్నట్లు తెలిపారు.
ఇక ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే హిందువుల్లో ఆయనకు ఎంత ఆదరణ ఉందో.. ముస్లింల్లో కూడా అంతే క్రేజ్ ఉన్నట్లు.. నజ్మా పర్వీన్ చేసిన పరిశోధనలో వెల్లడైనట్లు బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) ప్రొఫెసర్ రాజీవ్ స్పష్టం చేశారు.