ఎప్పుడూ పాలవంటి తెల్లటి రంగులో మెరిసిపోయే తాజ్‌మహల్ ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. పొగమంచు, ఢిల్లీలో కొనసాగుతున్న గాలి కాలుష్యం కారణంగా కనిపించకుండా పోతోంది. దీంతో ధవళ వర్ణంలో కనిపించే తాజ్‌మహల్ కాలుష్య కాటుకు గురవుతోంది. ఏటా శీతాకాలంలో పొగమంచు, గాలి కాలుష్యం కారణంగా తాజ్‌మహల్ మసకబారిపోతూ ఉంది. తాజ్‌ను కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలితాలను ఇవ్వడం లేదు. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలు కాలుష్య మయం కావడంతో రాజధాని ప్రాంత పరిధిలో ఉన్న చారిత్రాత్మక, సాంస్కృతి కట్టడాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే తాజ్‌మహల్ కూడా కాలుష్యానికి బలి అవుతోంది. అయితే తాజ్ ప్రేమికులు మాత్రం కాలుష్యం, పొగమంచు కమ్మేసినా.. దాని అందాన్ని మాత్రం ఆస్వాదిస్తూనే ఉన్నారు. పొగమంచు, కాలుష్యంతో నిండిపోయి కనిపించకుండా ఉన్నా.. తాజ్ మహల్‌ను ఫోటోలు, వీడియోలు తీస్తూ సందడి చేస్తున్నారు. కాలుష్యమైనా.. పొగమంచు అయినా తాజ్ మహల్ విశిష్ఠత ఏమీ మారదు అంటున్నారు. ఇక కాలుష్యం, పొగమంచులో మసకబారి కనిపించకుండా ఉన్న తాజ్ మహల్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మరోవైపు.. ఢిల్లీలో వాయు నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌పై 450పైగా నమోదవుతూ ఉండటం ప్రస్తుతం ఢిల్లీ వాసులను ప్రమాద ఊబిలోకి పడేస్తోంది. ఢిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్న కాలుష్యంతో ప్రజలు శ్వాసకోశ, నరాల సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు తీవ్ర కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ పలు హాట్‌స్పాట్ ప్రాంతాల్లో నీటిని విరజిమ్ముతోంది. కాలుష్యాన్ని అరికట్టేందుకు మొత్తం 12 ఫైర్ ఇంజిన్లు పనిచేస్తున్నాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ వెల్లడించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌పై ఢిల్లీలో గాలి నాణ్యత 457పైగా నమోదైంది. వాయు కాలుష్యం నేపథ్యంలో తాజాగా ఢిల్లీలో మరోసారి వాహనాలకు సరి-బేసి విధానం అమలు చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక దీపావళి తర్వాత ఢిల్లీకి మరింత వాయు కాలుష్యం సంభవిస్తుందన్న అంచనాలతో ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నరు. ఈ నెల 20 వరకు ఢిల్లీ పరిధిలో సరి-బేసి విధానం అమల్లో ఉంటుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ స్పష్టం చేశారు. ఇక ఈ వారం మొత్తం టెన్త్, ఇంటర్ మినహా అన్ని విద్యా సంస్థలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.