ఆప్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక సమావేశం నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా తన పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీ సీఎం భేటీ కావడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి నెలల తరబడి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ కూడా రాకపోవడంతోపాటు తాజాగా ఈడీ సమన్లు జారీ చేయడంతో అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయనున్నారా అనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలతో భేటీ జరపడం తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఆ పార్టీ ఎమ్మెల్యేలతో సోమవారం భేటీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గతవారం సమన్లు జారీ చేసిన వేళ ఈ సమావేశం కీలకంగా మారింది. అక్టోబర్ 30 వ తేదీన అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసిన ఈడీ.. నవంబర్ 2 వ తేదీన విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అయితే ఆ రోజు విచారణకు డుమ్మా కొట్టిన కేజ్రీవాల్.. ఈడీ ఆఫీస్‌కు వెళ్లకుండా పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం గమనార్హం.
ఈ క్రమంలోనే తనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడంపై కేజ్రీవాల్ స్పందించారు. తనకు ఈడీ పంపిన సమన్లు పూర్తిగా చట్ట విరుద్దమని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవి కక్షపూరితం, రాజకీయ ప్రేరేపితమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తీవ్ర ఒత్తిళ్ల కారణంగానే ఈడీ అధికారులు తనకు నోటీసులు జారీ చేశారని విమర్శలు గుప్పించారు. తనకు ఇచ్చిన సమన్లను ఈడీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా తనను అడ్డుకునేందుకే ఇప్పుడు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారని ఆరోపించారు.
ఇక ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన అవినీతి జరిగిందన్న ఆరోపణల కేసులో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో సీబీఐ అధికారులు దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించారు. ఇక వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్‌ను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఏర్పాటు చేసిన ‘ఇండియా కూటమి’ నాయకులను బీజేపీ లక్ష్యంగా చేసుకుందని ఆప్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.