ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి మంగళవారం తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ తొలి విడతలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉండటంతో ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా అత్యంత కీలకమైన బస్తర్ డివిజన్‌లో భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్ డివిజన్‌లో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వాటికి భారీ భద్రత నడుమ ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర బలగాలతో అడుగడుగునా భద్రతా సిబ్బందిని మోహరించారు. భద్రత కోసమే మొత్తం 60 వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
తొలి విడతలో భాగంగా మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక బస్తర్ డివిజన్‌లో ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 5304 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 600 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. ఒక్క బస్తర్ డివిజన్‌లోనే 60 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ హెచ్చరికల నేపథ్యంలో డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా వారి కదలికలను అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. బస్తర్ డివిజన్ పరిధిలో మూడంచెల భద్రతతో ఎన్నికల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించగా.. అందులో 40 వేల మంది సీఆర్‌పీఎఫ్, 20 వేల మంది ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులు ఉన్నారు. ఇందులోనే మావోయిస్టుల ఏరివేత కోసం ప్రత్యేకంగా పనిచేసే కోబ్రా యూనిట్, మహిళా కమాండోలు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇక మరింత భద్రత కోసం బస్తర్ డివిజన్‌లో ఉన్న 12 స్థానాల్లోని 5 నియోజకవర్గాల్లోని 149 పోలింగ్ స్టేషన్లను స్థానికంగా పోలీస్ స్టేషన్‌లు, భద్రతా క్యాంపులకు తరలించారు. బాంబు డిస్పోజల్ టీమ్స్, డాగ్ స్క్వాడ్‌లు కూడా రంగంలోకి దిగి అణువణువు గాలింపు చేపట్టారు. ఇక మరో 156 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సిబ్బందితోపాటు ఈవీఎంలను హెలికాప్టర్ ద్వారా గమ్య స్థానాలకు తరలిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి విడతలో 20 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బస్తర్ డివిజన్‌లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో తొమ్మిది స్థానాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక మిగతా 3 నియోజకవర్గాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బస్తర్ డివిజన్‌లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండగా.. ఆ ప్రాంతంలోని ప్రజలు ఎన్నికలకు దూరంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే నారాయణ్‌పుర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీజేపీ అభ్యర్థిని మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. గతంలో 2018 లో కూడా దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు చేసిన దాడిలో ముగ్గురు పోలీస్ సిబ్బందితోపాటు దూరదర్శన్ కెమెరామెన్ చనిపోయారు. మరోవైపు.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 10 మంది భద్రతా సిబ్బందిని మావోయిస్టులు హత్య చేశారు.