గత కొన్ని రోజులుగా నేపాల్‌ను భూకంపాలు వీడటం లేదు. తరచూ సంభవిస్తున్న భూకంపాలతో నేపాల్ ప్రజలు బిక్కుబిక్కుమంటు బతుకుతున్నారు. గత శుక్రవారం అర్ధరాత్రి రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 158 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు సంబంధించిన సహాయక చర్యలు కొనసాగుతుండగానే తాజాగా మరోసారి భారీ భూకంపం నేపాల్‌పై విరుచుకుపడింది. ఆ భూకంపం ధాటికి భారత్‌లోనూ భూమి కంపించింది. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సోమవారం మధ్యాహ్నం నేపాల్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపం మరోసారి తీవ్ర కలకలం రేపింది. గత మూడు రోజుల వ్యవధిలోనే రెండోసారి భారీ భూకంపం రావడంతో నేపాల్ వాసుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ భూకంపం ధాటికి ఢిల్లీలో కూడా భూమి కంపించింది. గత శుక్రవారం నేపాల్‌లో రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం భారీగా ప్రాణ నష్టాన్ని కలిగించింది. ఇప్పటికే ఆ భూకంపం ధాటికి 158 మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం సంభవించిన భూకంపం తర్వాత మరిన్ని భూకంపాలు సంభవించవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించడం మరింత కలవరం రేపుతోంది. 2015 తర్వాత నేపాల్‌లో సంభవించిన అతిపెద్ద భూకంపం ఇదే అని అక్కడి అధికారులు చెబుతున్నారు.