భార్యను అత్యంత దారుణంగా హత్యచేసిన ఓ భారతీయుడికి అమెరికా న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. మూడేళ్ల కిందట ఫ్లోరిడాలో జరిగిన భారతీయ నర్సు హత్య కేసులో ఆమె భర్తను న్యాయస్థానం దోషిగా నిర్దారించింది. కేరళకు చెందిన మెరిన్ జాయ్‌ను జులై 2020లో ఆమె పనిచేస్తోన్న ఆస్పత్రి వద్దే భర్త ఫిలిప్ మాథ్యూ అత్యంత కిరాతకంగా పొడిచి పొడిచి చంపాడు. భార్యను చంపినట్టు అంగీకరించడంతో మాథ్యుకు కోర్టు యావజ్జీవిత శిక్షను ఖరారు చేసింది.
బ్రోవార్డ్ హెల్త్ కోరల్ స్ప్రింగ్స్‌లో నర్సుగా పనిచేస్తోన్న మెరిన్ జాయ్ (26) 17 సార్లు కత్తిపోట్లకు గురయ్యింది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు పార్కింగ్‌లోని కారును తీస్తుండగా.. ఆమెపై మాథ్యు దాడి చేశాడు. కత్తితో పొడిచి పొడిచి.. ఆపై కారుతో తొక్కించి చంపేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఆమెపై నుంచి స్పీడ్ బంప్ లాగా మాథ్యూ డ్రైవింగ్ చేశాడని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. చనిపోయే ముందు తన ఏడాది పాపను తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారని అన్నారు.
విచారణ సందర్భంగా తాను ఘోరమైన తప్పిదం చేశానని, అయితేన తనకు మరణశిక్ష విధించవద్దని మాథ్యు వేడుకున్నాడు. ఆయుధంతో దాడి చేసినందుకు గరిష్టంగా ఐదేళ్లు... అప్పీలు చేసుకునే హక్కును వదులుకుంటున్నందున మరణశిక్షను జీవితఖైదుగా మినహాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ అటార్నీ కార్యాలయ ప్రతినిధి పౌలా మెక్‌మాన్ తెలిపారు. కుమార్తెను కోల్పోయిన నర్సు కుటుంబం కుంగిపోయింది. జాయ్ బంధువు జోబీ ఫిలిప్.. శుక్రవారం నాటి కోర్టు విచారణలో విర్చువల్‌గా పాల్గొన్నారు. కోర్టు తీర్పుపై జాయ్ తల్లి మాట్లాడుతూ.. ‘తన కుమార్తెను చంపిన కిరాతకుడు జీవితాంతం జైలులో ఉంటాడని తెలయడం చాలా ఆనందంగా ఉంది.. చట్టపరమైన ప్రక్రియ ద్వారా తమకు ఉపశమనం కలిగింది’ అని వ్యాఖ్యానించారు.