వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.... ఏమిటీ సామాజిక సాధికార యాత్ర? మన పార్టీ ఎందుకు చేస్తోంది? అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మనకు స్వతంత్రం వచ్చి 75సంవత్సరాలు దాటినా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల గురించి ఆలోచించినవారుగానీ, వారికి రాజ్యాంగంలోని హక్కులు అందించినవారుగానీ ఎవరూ లేరు. మన పిల్లలను పెద్ద చదువులు చదివించుకునే అవకాశం నిన్నామొన్నటి వరకు లేదు. మనకు రాజ్యాధికారం, అధికారం పదవులు ఎప్పుడూ లేవు. మైనార్టీ సోదరుల పరిస్థితీ మనలాంటిదే. ఆయా వెనుకబడిన వర్గాలకు ఏంచెయ్యాలని ఆలోచించే నాయకులు చరిత్రలో పెద్దగా లేరు. మన కళ్లముందు కనిపించేది ఇద్దరే నాయకులు. ఒకరు వైయస్సార్. ఇంకొకరు ఆయన తనయుడు జగన్‌మోహన్ రెడ్డి. సీఎం జగనన్న అన్ని కులాలు, వర్గాలను ఒకేలా చూస్తున్నారు. ఎక్కడా వివక్షకు చోటివ్వడం లేదు. అనేక ప్రభుత్వ కార్యక్రమాలతో, సంక్షేమ కార్యక్రమాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. ప్రతిభావంతుడైన పేదవిద్యార్థుల పెద్ద చదువులకు వైయస్సార్ ఎలాంటి రాజమార్గం వేశారో అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు మనవారి ప్రతి ఇంటిలో పెద్దచదువులు చదివిన పిల్లలు ఉన్నారంటే అది నాడు వైయస్సార్, నేడు జగనన్నల వల్లనే. 30 లక్షల మందికి ఇళ్లస్థలాలు ఇచ్చిన ఘనత జగనన్నదే. అన్నివర్గాల ప్రజలను ఒక చోటికి చేర్చి, ఊళ్లకు ఊళ్లు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలో గానీ లేని విధంగా పేదల గురించి ఆలోచిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. అందరికీ సమానావకాశాలు అందించడమే సామాజిక న్యాయమని తెలిపారు.