టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని.. అక్రమ కేసులు బనాయిస్తోందని ఫిర్యాదు చేశారు. లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాతతో పాటు నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, అశోక్‌బాబులు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగాయన్నారు నారా లోకేష్. ఈ విషయాన్నే గవర్నర్‌కు వివరించామని తెలిపారు. బాపట్ల జిల్లాలో బీసీ వర్గానికి చెందిన అమర్నాథ్ గౌడ్ నోట్లో పేపర్లు కుక్కి, పెట్రోల్ పోసి వైఎస్సార్‌సీపీ నేతలు తగులబెట్టారన్నారు. దళిత వర్గానికి చెందిన శ్యామ్‌కుమార్‌పై దాడి చేసి మూత్రం పోసిన ఘటననూ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఆయనకు వివరించామన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్షాలపై జగన్ ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను దృష్టికి తీసుకెళ్లామన్నారు. వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడిన విషయాన్ని నివేదించినట్లు తెలిపారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు అడ్డుకట్ట వేసేలా రూపొందించిన 17ఏ సెక్షన్‌ను సైతం తుంగలో తొక్కి.. గవర్నర్ వ్యవస్థను కూడా గౌరవించకుండా జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వివరించామన్నారు లోకేష్. ప్రతిపక్షాలపై జగన్‌కు నరనరానా కక్ష సాధింపే ఉందన్నారు లోకేష్. టీడీపీ సానుభూతిపరులపై 60 వేల కేసులు పెట్టారన్నారు. ఈ పాలనలో దక్షిణ భారతదేశ బిహార్‌గా ఏపీ మారిందని విమర్శించారు. న్యాయ వ్యవస్థపైనా వైఎస్సార్‌సీపీ నేతలు దాడులు చేస్తున్నారని.. ప్రజల తరఫున పోరాడుతున్న వారిపై దొంగ కేసులు పెడుతున్నారన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందని.. రాజ్యాంగాన్ని కాపాడాలని ఆయన్ను కోరామన్నారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఎటువంటి ఆధారాలు లేకపోయినా 53 రోజుల పాటు జైలులో నిర్బంధించిన విధానాన్ని గవర్నర్‌కు తెలిపామన్నారు. ఈ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు చెక్ పెట్టేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 ప్రకారం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరామన్నారు. టీడీపీ నేతలపై వందలాది అక్రమ కేసులు బనాయించారని.. ఈ విషయాన్ని ఆధారాలతో సహా గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్న విషయంపై గవర్నర్‌కు వివరించామన్నారు.ఎన్ని కేసులు నమోదు చేసినా వెనక్కు తగ్గేది లేదని.. తమ పోరాటం కొనసాగుతుందన్నారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతి నేత , కార్యకర్త ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతారన్నారు. అలాగే ఓటర్ల జాబితాలో అవకతవకలు, దొంగ ఓట్లపైనా టీడీపీ పోరాటం కొనసాగుతుందన్నారు.