ప్రజలకు జవాబుదారీగా దేశంలో పాలన సాగించిన ఘనత సీఎం జగన్ దేనని మంత్రి ధర్మాన కొనియాడారు. అయన మాట్లాడుతూ... 5 ఏళ్ల తర్వాత సామాజిక అంతరాలు, ప్రజల జీవన స్థితిగతులు నిర్లిప్తంగా పడి ఉంటే, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక సాధికారత దిశగా అడుగులు వేసారన్నారు. దేశంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనని వెల్లడించారు. ఉద్దానంలో ప్రతిపక్ష నేతలు వచ్చి కన్నీరు కార్చి డ్రామాలాడారని, జగన్ వచ్చి పరిశోధనల నివేదిక మేరకు పరిశుద్ధమైన నీరు అందించే పథకానికి రూ. 800 కోట్లు తో శ్రీకారం చుట్టారన్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టును 23న సీఎం జగన్ ప్రారంభించనున్నారన్నారు. విశాఖను రాజధాని చేస్తానంటే టీడీపీ నేతలు ఎందుకు వొద్దంటున్నారో చెప్పాలని, ఇక్కడ వ్యాపారాలు చేసుకుని హైదారాబాద్ లో ఉండేవారు మాత్రమే అడ్డుకుంటున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని విషయంలో గుట్టుచప్పుడు కాకుండా ప్రజలతో సంబంధం లేకుండా చంద్రబాబు తన మనుషులతో కలసి నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు, రాజధానిగా విశాఖ కంటే అర్హత కలిగిన మరో నగరం ఏదైనా ఉందా అని ధర్మాన చంద్రబాబును ప్రశ్నించారు. మన సంక్షేమం కోసం పాటుపడే వైయస్సార్ సిపి ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు.