దేశవ్యాప్తంగా దీపావళి సందడి కనిపిస్తోంది.. తెలుగు రాష్ట్రల్లో, ముఖ్యంగా ఏపీలో కూడా ఘనంగా జరుపుకునేందుకు జనాలు సిద్ధమయ్యారు. అయితే దీపావళి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది స్వీట్లు. మరి దీపావళికి స్వీట్స్ కొనుగోలు చేసేవారికి ముఖ్యమైన గమనిక. షాపుల్లో కొనే స్వీట్లు నాణ్యతను తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. పండగ వేళ విశాఖలోని ప్రముఖ స్వీట్ షాపులపై అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా చాలా దుకాణాల నిర్వాహకులు ప్రమాణాలు పాటించడం లేదని తేలింది.
విశాఖ నగరంలోని అనేక స్వీట్ దుకాణాలపై ఏఎఫ్‌సీ నందాజీ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అప్పారావు నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపుదాడులు చేశారు. ఈ సందర్భంగా ఈగలు, దోమల నియంత్రణకు కొన్ని స్వీట్ షాపులు కనీస జాగ్రత్తలు పాటించడం లేదని గుర్తించారు. దీపావళి నేపథ్యంలో నాసిరకం, నాణ్యత లేని మిఠాయిలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన అధికారులు.. వాటి శాంపిల్స్ సేకరిస్తున్నారు. కొన్ని చోట్ల తయారు చేసిన మిఠాయిల్లో ఆరోగ్యానికి హాని కలిగించే సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగించినట్టు అనుమానిస్తున్నారు.
స్వీట్స్ డిస్‌ప్లే పెట్టిన చోట ఈగలతో అన్-హైజినిక్ కండిషన్లు ఉన్నట్టు కూడా గుర్తించారు. స్వీట్స్ కవర్లపై మానుఫాక్యరింగ్, ఎక్స్‌పైరీ డేట్ ముద్రించాల్సి ఉండగా అవేమీ చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. స్వీట్ షాపుల్లో అనుమానస్పదంగా ఉన్న మిఠాయిల శాంపిల్స్ సేకరించిన అధికారులు వాటిని ల్యాబ్‌కు పంపిస్తున్నారు. పరీక్షల్లో నాసిరకం, నాణ్యతా ప్రమాణాలు పాటించనట్టు తేలితే కఠినచర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. గతంలోనూ అనేక స్వీట్ షాపుల్లో తనిఖీలు చేసి జరిమానాలు విధించినా నిర్వాహకుల్లో మార్పు రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.