దీపావళి పండగ అంటేనే దీపాల వెలుగులతో దేశం మొత్తం వెలిగిపోతూ ఉంటుంది. దీపాలు, బాణసంచా వెలుగులతో ఆ నెల రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీంతో దీపావళి పండగ వచ్చిందంటే దేశం మొత్తం సంబరంగా ఉత్సవాలను జరుపుకుంటుంది. కానీ ఆ గ్రామాల్లో మాత్రం దీపావళికి చిమ్మచీకట్లు అలుముకుంటాయి. దీపాలు గానీ, బాణసంచా గానీ పేల్చకుండా ఉంటారు. దీంతో ఆ గ్రామాల్లో అసలు పండగ శోభనే కనిపించదు. ఇక దీపావళి పండగ వచ్చిందంటే చాలు తమ పిల్లలను బంధువుల ఊర్లకు పంపిస్తున్నట్లు ఆ గ్రామాల ప్రజలు చెబుతున్నారు.
పంజాబ్‌లోని బటిండా జిల్లాలోని మూడు గ్రామాలు అర్ధ శతాబ్దం నుంచి దీపావళి పండగను జరుపుకోవడం లేదు. అయితే ఇందుకు ఒక కారణం ఉంది. ఈ మూడు గ్రామాల పరిధిలో ఆర్మీ కంటోన్మెంట్, మందుగుండు సామగ్రి డిపోను ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామాల్లో బాణసంచా పేల్చడం, దీపావళి జరుపుకోవడం నిషేధించారు. ఒక వేళ నిప్పు రవ్వలు ఆర్మీ కంటోన్మెంట్, మందుగుండు సామాగ్రి డిపోపై పడితే భారీ ప్రమాదం సంభవించవచ్చని ఈ నిషేధాన్ని విధించారు. దీంతో ఆ 3 గ్రామాల్లో దీపావళి శోభ వెలవెలబోతున్నాయి.
1976 లో బటిండా జిల్లాలోని ఫూస్ మండి, భగు, గులాబ్గఢ్ గ్రామాల పరిధిలో సైనిక కంటోన్మెంట్, మందుగుండు సామాగ్రి డిపోను ఏర్పాటు చేశారు. వీటిని ఏర్పాటు చేసేందుకు ఆ గ్రామాల పరిధిలో భారీగా భూమిని సేకరించారని స్థానికులు తెలిపారు. అయితే కేవలం దీపావళి పండగ వేళ టపాసులు కాల్చడంపైనే కాకుండా పంట వ్యర్థాలను కూడా తగలబెట్టడంపై నిషేధం విధించారని ఆ 3 గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ఎవరైనా టపాసులు గానీ, పంట వ్యర్థాలు గానీ కాల్చినా.. బటిండా జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
ఆర్మీ కంటోన్మెంట్, మందుగుండు సామగ్రి డిపో ఏర్పాటు చేయడం వల్ల తాము అభివృద్ధికి దూరంగా ఆగిపోయామని స్థానికులు వాపోతున్నారు. తమ గ్రామాల్లోని భూముల ధరలు పెరగడం లేదని.. దీనికితోడు 5,6 గ్రామాలకు చేరుకునేందుకు కనీసం సరైన రోడ్డు మార్గం కూడా లేదని చెబుతున్నారు. దీంతో రోజువారి రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇవన్నీ పక్కన పెడితే ఆర్మీ కంటోన్మెంట్‌లో గడువు ముగిసిన మందుగుండు సామగ్రిని పేల్చినపుడు వాటి శకలాలు తమ గ్రామాలపై పడుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలతో తమకు ఆస్తి నష్టం కలుగుతోందని.. అయినా వాటిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇన్ని ఆంక్షలకు తోడు కంటోన్మెంట్ ప్రాంతంలో కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా నిషేధం విధించారని స్థానిక గ్రామాల ప్రజలు తెలిపారు.