వాహనాలు రోడ్లపైకి తీసుకువస్తున్నామంటే మనం తప్పకుండా ట్రాఫిక్ నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఒక వేళ పొరపాటున గానీ.. కావాలని గానీ గీత దాటితే ట్రాఫిక్ పోలీసులు వారి కెమెరాలకు పని చెప్పి ఫోటో క్లిక్‌మనిపిస్తారు. దీంతో మన వాహనం నంబర్ ఆధారంగా ఈ-చలాన్ వేస్తారు. అయితే ఇలా ట్రాఫిక్ చలాన్లు ఉన్నా కొందరు వాహనదారులు చేసిన పనులు మాత్రం మామూలుగా ఉండవు. ఎందుకంటే ఓ బైకర్ రోడ్డుపైకి వచ్చి.. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా డ్రైవింగ్ చేశాడు. దీంతో ట్రాఫిక్ కెమెరాలకు చిక్కాడు. ఆ తర్వాత ఆ కెమెరాల ముందు చిత్రవిచిత్రంగా ప్రవర్తించాడు. చివరికి ఆ బైక్‌పై ఏకంగా 155 ట్రాఫిక్ చలాన్లు పడగా.. వాటిని కట్టకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే చివరికి ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది.
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల ఓ యువకుడు తన బైక్‌తో రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ నియమాలు పాటించేవాడు కాదు. ఏకంగా ఆ వ్యక్తి బైక్‌పై 155 ట్రాఫిక్ చలాన్లు నమోదయ్యాయి. ఇక ఆ యువకుడికి కేరళ స్టేట్ మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్ భారీ షాక్ ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా అనేక సార్లు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడమే కాకుండా కెమెరాల ముందు విచిత్ర ప్రవర్తనకు పాల్పడిన ఆ వ్యక్తికి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆ వ్యక్తికి ఏకంగా రూ.86 వేల ఫైన్ విధించింది. అంతేకాకుండా ఏడాది పాటు ఆ యువకుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసింది.
ఆ యువకుడు బైక్‌పై వెళ్తూ చాలామార్లు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించాడని.. అందుకు సంబంధించి రోడ్లపై ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాల్లో అన్ని దృశ్యాలు రికార్డ్ అయ్యాయని అధికారులు వెల్లడించారు. హెల్మెట్ లేకుండా వెళ్లడమే కాకుండా రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్ సహా మరిన్ని ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా డ్రైవింగ్ చేసినట్లు పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా తనను ఎవరూ ఏమీ చేయలేరనే భావనతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాల ముందు చిత్ర విచిత్రమైన హావభావాలు ప్రదర్శించినట్లు తెలిపారు.
అయితే ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినందుకు ఫైన్ చెల్లించాలని ఎన్నిసార్లు ఆ యువకుడికి మెయిల్స్ పంపినా పట్టించుకోలేదని చెప్పారు. దీంతో విసిగిపోయిన కేరళ స్టేట్ మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్ అధికారులు.. స్వయంగా అతడి ఇంటికి వెళ్లారు. దీంతో అతడు చిక్కడంతో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డందుకు గానూ రూ.86 వేల ఫైన్ చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. అది చూసి ఆ యువకుడు ఖంగు తిన్నాడు. తన వద్ద ఉన్న బైక్‌ను అమ్మినా రూ. 86 వేలు రావని.. అంత జరిమానా ఎలా చెల్లించాలంటూ ప్రశ్నించాడు.