ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌లో వరుసగా ఉగ్రవాదుల హత్యలు.. ఎవరు చేస్తున్నారు

international |  Suryaa Desk  | Published : Fri, Nov 10, 2023, 10:37 PM

పాక్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్ర సంస్థలకు వరుసగా భారీ షాక్‌లు తగులుతున్నాయి. పాక్‌లో నివాసం ఉంటున్న ఉగ్రవాదులే లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు హత్యలకు పాల్పడుతున్నారు. అయితే గత 20 నెలలుగా పాక్‌లో 19 మంది ముష్కరులు హతం కావడం సంచలనంగా మారుతోంది. తాజాగా లష్కరే తోయిబా టాప్ కమాండర్ అక్రమ్ ఖాన్ ఘాజీ దారుణ హత్యకు గురయ్యారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అక్రమ్ ఖాన్ ఘాజీని హత్య చేసినట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. అయితే భారత్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు వరుసగా హతం అవుతున్నారు. వారం రోజుల క్రితమే లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది ముజాహిద్ అనుమానాస్పద స్థితిలో హతం కాగా.. తాజాగా మరొకరు హత్యకు గురయ్యాడు.


వరుసగా పాక్‌లో ఉంటున్న ఉగ్రవాదులు హతం అవుతుండటం.. పాక్ నిఘా సంస్థ-ఐఎస్ఐ, ఇతర ఏజెన్సీలకు పెను సవాల్‌గా మారింది.


అయితే ఈ అక్రమ్ ఖాన్ ఘాజీ హత్యకు స్థానికంగా ప్రత్యర్థి గ్రూపుల హస్తం ఉందన్న అనుమానంతో లష్కర్ ఏ తోయిబాలో జరుగుతున్న అంతర్గత పోరుపై పాకిస్తాన్ ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి. పాకిస్థాన్‌లో భారత్‌కు వ్యతిరేకంగా ప్రసంగాలు చేయడం ద్వారా అక్రమ్ ఖాన్ ఘాజీ ఫేమస్ అయ్యాడు. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలో కీలక వ్యక్తి అయిన ఘాజీ చాలా కాలం ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. 2018 నుంచి 2020 వరకు లష్కరే తోయిబా రిక్రూట్‌మెంట్ సెల్‌కు అధినేతగా ఉన్నాడు. తీవ్రవాదం, భారత్‌కు వ్యతిరేకంగా పోరాడే తత్వం ఉన్న వ్యక్తులను గుర్తించి.. వారికి ఉగ్రవాద శిక్షణ ఇచ్చేందుకు ఈ లష్కరే తోయిబా రిక్రూట్‌మెంట్ సెల్ పనిచేస్తుంది.


గత రెండేళ్లుగా పాక్ నుంచి కాశ్మీర్‌లోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులకు ఈ అక్రమ్ ఘాజీ.. భారత్‌కు వ్యతిరేకంగా విద్వేషాన్ని పెంచుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ హత్యను బయటికి రాకుండా చూసేందుకు పాకిస్థాన్ ఐఎస్‌ఐ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే 3 నెలల వ్యవధిలోనే లష్కరే తోయిబాకు చెందిన టాప్‌ కమాండర్లు హతం కావడం ఇది రెండోసారి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని రావల్‌కోట్‌లో ఉన్న ఓ మసీదు ముందు లష్కరే తోయిబా సీనియర్‌ కమాండర్‌ రియాజ్‌ అహ్మద్‌ను దుండగులు కాల్చి చంపారు. పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఆధ్వర్యంలోనే ఈ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ పనిచేస్తుంది. ఇక ఇటీవల హత్యకు గురైన లష్కరే తోయిబా ఉగ్రవాది షాహిద్‌ ఖ్వాజా.. 2018 లో భారత్‌లో సుంజ్వాన్‌ ఆర్మీ క్యాంప్‌పై దాడికి సూత్రధారిగా ఉన్నాడు.


గత 20 నెలల్లో హతమైన 19 మంది ఉగ్రవాదుల్లో లష్కరే తోయిబాతోపాటు జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు కూడా భారీగానే ఉన్నారు. జైషే మహమ్మద్ చీఫ్‌ మసూద్‌ అజర్‌కు అత్యంత సన్నిహితుడైన దావుద్‌ మాలిక్‌ను గత నెలలో నార్త్‌ వజీరిస్థాన్‌లో దుండగులు కాల్చిచంపారు. ఇక హిజ్బుల్‌ ముజాహిదీన్ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ సన్నిహితుడు ముఫ్తీ ఖైజర్‌ ఫారుఖీని కరాచీ నగరంలో హత్య చేశారు. భారత విమానం హైజాక్‌లో కీలక పాత్ర పోషించిన జైషే మహమ్మద్ ఉగ్రవాది మిస్త్రీ జహూర్‌ ఇబ్రహీంను పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో షూట్ చేశారు. పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రవాదుల హతం అవుతుండటంతో పాక్‌ ఐఎస్‌ఐ తీవ్ర ఆందోళనలో పడింది. దీంతో ఇప్పటికే ముందు జాగ్రత్తగా చాలా మంది ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com