ఏలూరు జిల్లా కొయ్యలగూడెం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను లారీ ఢీకొట్టింది.. దాదాపు 20కిలో మీటర్ల వరకు బైక్‌ను ఈడ్చుకెళ్లింది. ఆదివారం రాత్రి కొంతమంది తమ బైక్‌లను కొయ్యలగూడెం దగ్గర నేషనల్ హైవేపై పక్కన ఓ హోటల్ దగ్గర నిలిపారు. ఆ సమయంలో అటువైపు వేగంగా వచ్చిన లారీ.. పార్క్ చేసి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వాహన దారుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ క్రమంలో ఓ బైక్‌ను లారీ అలాగే ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన జరిగిన వెంటనే కొయ్యలగూడెం పోలీసులు ఇచ్చిన సమాచారంతో తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి పోలీసులు అప్రమత్తం అయ్యారు. కొయ్యలగూడెం నుంచి దాదాపు 20కి.మీ దూరంలోని దేవరపల్లి డైమండ్ జంక్షన్ దగ్గర పోలీసులు లారీని అడ్డగించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బైక్‌ల దగ్గర జనాలు ఉంటే పరిస్థితి ఏంటని స్థానికులు అంటున్నారు. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత 20 కిలో మీటర్ల వరకు బైక్‌ను లాక్కెళ్లడంపై చర్చ జరుగుతోంది. ఇంత జరిగినా డ్రైవర్ ఎందుకు చూసుకోలేదనే ప్రశ్న వినిపిస్తోంది. మరోవైపు లారీనీ ఆపే క్రమంలో పోలీసులు అడ్డు రాగా.. వారిని కూడా ఢీకొట్టేందుకు లారీ డ్రైవర్ యత్నించారని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.