ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. కార్తీక మాసం సందర్భంగా ఒకే రోజు పంచారామ క్షేత్రాలను దర్శించేలా.. శబమరిలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆరు, ఏడు రోజుల చొప్పున ప్యాకేజీలు రూపొందించారు. ప్రత్యేక బస్సులు రీజియన్ల వారీగా ఏర్పాటు చేయనున్నారు. విశాఖ రీజియన్ అధికారులు ఇప్పటికే శబరిమల అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ప్రకటించారు. ఐదు రోజులు ప్యాకేజీలో భాగంగా విశాఖలో బయలుదేరి విజయవాడ, మేల్ మర ఒత్తూరు, ఎరిమేలి, పంబ, సన్నిధానం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, విజయవాడ నుంచి విశాఖ వస్తారు. ఏడు రోజుల యాత్రలో భాగంగా సూపర్ లగ్జరీ టిక్కెట్టు రూ.7000, అల్ట్రా డీలక్స్ రూ.6900గా నిర్ణయించారు. ఏడు రోజుల యాత్రలో భాగంగా విశాఖ నుంచి విజయవాడ, కాళహస్తి, బెంగళూరు, మైసూరు, గురువారాయి, ఎరిమేలి, పంబ, సన్నిధానంకు చేరుకుంటారు.
ఇతర రీజియన్ల అధికారులు కూడా అయ్యప్ప స్వాముల కోసం టూర్ ప్యాకేజీలు రూపొందిస్తున్నారు. పార్వతీపురం నుంచి ఈ నెల 19, 26, డిసెంబర్ 3, 10 తేదీల్లో సర్వీసులు నడుపుతున్నట్లు చెప్పారు. పార్వతీపురంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. సోమవారం ఉదయం అమరావతి- అమరేశ్వరుడు, భీమవరం- భీమేశ్వరుడు, పాలకొల్లు- క్షీర రామలింగేశ్వరుడు, ద్రాక్షారామం- భీమలింగేశ్వరుడు, సామర్లకోట- కుమార లింగేశ్వరుడును దర్శించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. అల్ట్రా డీలక్స్‌లో ఒక్కొక్కరికి రూ.2,150 ఛార్జీగా నిర్ణయించామన్నారు. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ఆరు రోజుల యాత్ర సాగేలా సర్వీసులు నడుపుతున్నామన్నారు. కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, పళని, ఎరుమేలి, శబరిమల, మధురై, కంచి, తిరుపతి, విజయవాడలో ప్రసిద్ధ దేవాలయాల సందర్శనకు వీలుగా యాత్ర ఉంటుంది అన్నారు. సూపర్ లగ్జరీకి రూ.7,300, అల్ట్రా డీలక్స్‌కు రూ.7,200లు ఛార్జీలు ఉన్నాయన్నారు. అడ్వాన్స్ రిజర్వేషన్ కోసం 73828 34904కు కాల్ చేయాలని సూచించారు. అంతేకాదు వెబ్సైట్లోనూ టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. ప్రతి నెలా పౌర్ణమి రోజున తమిళనాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళుతుంటారు. వీరిని దృష్టిలో ఉంచుకొని ప్రతి రీజియన్ నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. మరిన్ని వివరాల కోసం ఆయా డిపోలు, రీజియన్ అధికారుల్ని సంప్రదించాలని ఆర్టీసీ సూచించింది. కార్తీక మాసం కావడంతో పంచారామాలకు ఏపీలోని ఆయా డిపోల నుంచి స్పెషల్ బస్సుల్ని నడుపుతోంది ఆర్టీసీ. అలాగే శ్రీశైలంకు కూడా బస్సుల్ని నడపనున్నారు.. భక్తుల రద్దీని బట్టి సర్వీసుల్ని కూడా మరిన్ని పెంచుతామని చెబుతున్నారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు.