అనంతపురం జిల్లాలో భారీగా కర్ణాటక మద్యం దొరికింది. బెంగళూరు నుంచి గుంతకల్లుకు కారులో అక్రమంగా తరలిస్తుండగా.. సెబ్, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి పట్టుకున్నారు. శ్రీనివాస్ చేతన్, రమేష్‌లు బెంగుళూరులోని ఓ ప్రైవేటు స్కూల్‌లో క్లర్కులుగా పని చేస్తున్నారు. వీరికి గుంతకల్లు, గుత్తి పరిసర ప్రాంతాల వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. వీరు బెంగళూరులో ప్రభుత్వ మద్యం షాపుల్లో తక్కువ ధరకు మద్యాన్ని కొనుగోలు చేసి గుంతకల్లుకు తరలించి అధిక ధరలకు విక్రయించేవారు.
వీరిద్దరు శనివారం కూడా ఓ కారులో రూ.1,12,000 విలువ చేసే 29 కార్టన్ పెట్టెల్లో 2,784 టెట్రా ప్యాకెట్లతో గుంతకల్లుకు బయలుదేరారు. సమాచారం అందుకున్న సెబ్, సెబ్ ఇంటెలిజెన్స్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు రాప్తాడు మండలం మరూరు టోల్‌ప్లాజా దగ్గర కారును ఆపారు. నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నించారు.. వెంటనే స్పందించిన పోలీసులు కారును చుట్టుముట్టి తనిఖీ నిర్వహించారు. మద్యాన్ని, కారును జప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇటీవల కాలంలో అనంతపురం జిల్లాకు కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ చాలామంది దొరికిపోయారు. అనంతపురం జిల్లా కర్ణాటకకు సరిహద్దుకు దగ్గరగా ఉండటంతో కొంతమంది అక్కడ మద్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారు. కానీ సెబ్, పోలీసులు నిఘా పెంచి ఎప్పటికప్పుడు వీరి ఆటకట్టిస్తున్నారు. గతంలో చాలామంది ఇలా దొరికిపోయారు.