తన అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. మరుసటి రోజే కేబినెట్లో మార్పులు చేశారు. హోం మంత్రి (సెక్రటరీ) పదవి నుంచి సుయెల్లా బ్రేవర్‌మాన్‌ను తప్పించిన రిషి.. ఆమె స్థానంలో విదేశాంగ మంత్రిగా పని చేస్తోన్న జేమ్స్ క్లెవర్లీని హో మంత్రిగా నియమించారు. అదే సమయంంలో ఊహించని రీతిలో మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్‌కు విదేశాంగ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 2010-16 మధ్య కాలంలో యూకే ప్రధానిగా పని చేసిన కామెరాన్.. ఇప్పుడు రిషి సునాక్ కేబినెట్లో మంత్రిగా పని చేయనుండటం గమనార్హం.
కామెరాన్ నియామకం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురి చేసింది. మాజీ ప్రధాని అయిన కామెరాన్‌కు ప్రస్తుతం యూకే చట్ట సభ్యల్లో సభ్యత్వం లేదు. సాధారణంగా ఉన్నతమైన ప్రభుత్వ పదవుల్లోకి చట్ట సభ్యులనే తీసుకుంటారు. అయినా సరే రిషి సునాక్.. కామెరాన్‌కు కీలకమైన విదేశాంగ శాఖ బాధ్యతలు అప్పగించడం విశేషం. మన దగ్గర రాజ్యసభ లాగే.. యూకే పార్లమెంట్‌లో అప్పర్ చాంబర్, ది హౌస్ ఆఫ్ లార్డ్స్ అనిపిలిచే ఎగువ సభ ఉంటుంది. కామెరాన్‌కు ఈ అప్పర్ ఛాంబర్ సభ్యత్వం కల్పించనున్నారు. ఇంతకు ముందు పీటర్ క్యారింగ్టన్ 1980ల్లో హౌస్ ఆఫ్ కామన్స్ (మన లోక్ సభ లాంటి) ద్వారా కాకుండా పెద్దల సభ ద్వారా ఎన్నికై విదేశాంగ మంత్రిగా పని చేశారు. మార్గరేట్ థాచర్ ప్రధానిగా ఉన్న సమయంలో పీటర్ విదేశాంగ శాఖ మంత్రిగా వ్యవహరించారు.
ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్‌కు అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానిగా పని చేసిన అనుభవం ఉన్న కామెరాన్‌కు విదేశాంగ బాధ్యతలను రిషి అప్పగించారు. గత ఏడేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు కామెరాన్ దూరంగా ఉన్నారు. కానీ అంతకు ముందు 11 ఏళ్లపాటు కన్జర్వేటివ్ పార్టీ లీడర్‌గా వ్యవహరించడంతోపాటు ఆరేళ్లపాటు బ్రిటన్ ప్రధానిగా పనిచేశారు. ఈ అనుభవంతో కీలక సవాళ్లను ఎదుర్కోవడంలో తాను ప్రధాన మంత్రికి సాయం చేస్తానని డేవిడ్ కామెరాన్ తెలిపారు.
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదలగొద్దని డేవిడ్ కామెరాన్ భావించారు. దేశ ప్రజలు కూడా తన అభిప్రాయానికే మద్దతునిస్తారని ఆయన భావించారు. కానీ 2016లో నిర్వహించిన రెఫరెండంలో ఈయూ నుంచి బయటకు రావాలనే వాదనకే ప్రజలు మద్దతు పలికారు. దీంతో మరుసటి రోజే కామెరాన్ గ్రీన్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాలనే నిర్ణయానికి రిషి సునాక్ గట్టి మద్దతుదారు.