పాఠశాలల్లో క్రీడల్లో ప్రతిభ గల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు త్వరలో ప్రతి జిల్లాలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. వీటిని ఈ విద్యా సంవత్సరంలోనే అందుబాటులోకి తీసుకొచ్చి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కేంద్రాలలో ఎంపిక చేసిన క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రగతి, బోధన ప్రమాణాల మెరుగుదల కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రతినెలా సబ్జెక్టుల ఉపాధ్యాయులతో స్కూల్ కాంప్లెక్స్ నిర్వహిస్తున్నారు. ఇకపై ఈ స్కూల్ కాంప్లెక్స్‌లో క్రీడా సామగ్రి వినియోగంపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నారు. స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో పీఈటీలు లేని పాఠశాలల్లో స్థానిక ఉపాధ్యాయులను గుర్తించి విద్యార్థుల్లో క్రీడలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్.సురేష్ కుమార్ ఆదేశాలు సైతం జారీ చేశారు.