వైద్య రంగంలో అప్పుడప్పుడూ చాలా అరుదైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తాజాగా ఓ మహిళకు రెండు గర్భాశయాలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. అయితే రెండు గర్భాల్లో ఒకేసారి ఇద్దరు శిశువులు పెరగడం మరింత అరుదు అని వైద్యులు వెల్లడించారు. ఒకే మహిళలకు రెండు గర్భాశయాలు ఉండటం అనేది అత్యంత అరుదైన సంఘటన అని డాక్టర్లు తెలిపారు. ఒకవేళ ఒక మహిళకు రెండు గర్భాశయాలు ఉన్నా.. ఆ రెండింటిలోనూ శిశువులు పెరగడం అనేది ఇంకా అరుదైన ఘటన అని స్పష్టం చేశారు. అయితే ఇలా ఉంటే డెలివరీ సమయంలో చాలా రిస్క్ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి విచిత్ర సంఘటనే అమెరికాలో చోటు చేసుకుంది.
దక్షిణ అమెరికాలోని అలాబామా రాష్ట్రానికి చెందిన కెల్సీ హాట్చర్, కాలేబ్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే తాజాగా కెల్సీ హాట్చర్ మరోసారి గర్భం దాల్చింది. అయితే ఆమెకు రెండు గర్భాశయాలు ఉన్నాయని.. డాక్టర్ల పరిశీలనలో తేలింది. ఆ 2 గర్భాల్లో ఇద్దరు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ మహిళకు రెండు గర్భాశయాలు ఉన్నాయని డాక్టర్లు ఇది వరకే చెప్పగా.. ఈ సారి మాత్రం ఆ రెండు గర్భాశయాల్లోనూ ఇద్దరు శిశువులు పెరగడం తీవ్ర సంచలనంగా మారింది. అయితే సాధారణంగా ఇలా జరగదని.. ఏదో ఒక గర్భంలో మాత్రమే పిండం అభివృద్ధి జరుగుతుంటుందని వైద్యులు చెప్పారు. ఒకే గర్భాశయంలో ఇద్దరు ఉంటే కవలలు అని పిలుస్తారని.. అయితే వేర్వేరు గర్భాశయాల్లో పిండాలు పెరుగుతున్నప్పుడు ఏమని పిలవాలోనని కెల్సీ హాట్చర్‌కు వైద్యం అందిస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేతా పటేల్ తెలిపారు. ఇలా జరగడం అత్యంత అరుదు అని శ్వేత పటేల్ వెల్లడించారు.
కొంతమంది స్త్రీలలో పుట్టుకతోనే ఇలా రెండు గర్భాశయాలు ఉంటాయని గైనకాలజిస్ట్ తెలిపారు. అరుదైన సందర్భాల్లోనే ఇలా వేర్వేరుగానే రెండు గర్భాశయాల్లో పిండాలు అభివృద్ధి చెందడం జరుగుతుందని చెప్పారు. ఇలా రెండు గర్భాశయాలు ఉన్న స్త్రీలు విజయవంతంగా ప్రెగ్నెంట్ అయినప్పటికీ.. తరుచుగా గర్భస్రావం లేదా నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం వంటివి జరుగుతాయని మరో డాక్టర్ రిచర్డ్ డేవిస్ తెలిపారు. ప్రతి వెయ్యి మంది మహిళలల్లో ముగ్గురికి ఇలా రెండు గర్భాశయాలు ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం తాము కెల్సీ హాట్చర్‌ను చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని.. ఇదొక ప్రత్యేకమైన కేసుగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఆమెకు డెలివరీ అయ్యే వరకు చాలా జాగ్రత్త ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. అయితే కెల్సీ హాట్చర్ రెండు గర్భాశయాల్లో పెరుగుతున్న ఇద్దరు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పలేమని గైనకాలజిస్ట్ శ్వేతా పటేల్ తెలిపారు. వారు డెలివరీ సమయంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవచ్చనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. వైద్య పరంగా ఇది చాలా అరుదైన విషయమే అయినప్పటికీ.. ఆ శిశువులని కవలలని కాకుండా ఏమని పిలవాలో తెలియడం లేదని పేర్కొన్నారు.