ఇజ్రాయెల్‌పై హమాస్ గ్రూప్ చేసిన దాడికి ఫలితాన్ని గాజా స్ట్రిప్‌లో ఉన్న అమాయక పాలస్తీనీయన్లు అనుభవిస్తున్నారు. హమాస్ ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా గాజా భూభాగంలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం.. భీకర పోరు జరుపుతోంది. ఈ క్రమంలోనే గాజాలోని ఆస్పత్రిలో చనిపోయిన 179 మందిని ఆ ఆస్పత్రి ఆవరణలోనే సామూహిక ఖననం చేశారు. అందులో అప్పుడే పుట్టిన పసిబిడ్డలు కూడా ఉండటం తీవ్ర ఆందోళన కలుగుతోంది.
గాజాలో అతి పెద్ద ఆస్పత్రిగా పేరుగాంచిన అల్ షిఫా ఆస్పత్రి ప్రాంగణంలో తాజాగా 179 మందిని సామూహికంగా ఖననం చేశారు. ఈ విషయాన్ని అల్ షిఫా హాస్పిటల్ చీఫ్ మహ్మద్ అబు సల్మియా వెల్లడించారు. ఈ కారణంగా మానవతా సంక్షోభం నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సామూహిక ఖననం చేసిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. ఇందులో ఆస్పత్రికి ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడంతో ఐసీయూలో ఉన్న ఏడుగురు పిల్లలతో సహా 29 మంది రోగులు మృత్యువాత పడినట్లు చెప్పారు.
అయితే మొత్తం 179 మందిని ఒకేసారి ఆస్పత్రి ఆవరణలోనే సామూహికంగా పూడ్చిపెట్టినట్లు అల్ షిఫా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే ఏడుగురు చిన్న పిల్లల‍్ని ఒకే కార్పెట్‌లో చుట్టి సమాధి చేసిన ఫొటోను ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం ప్రపంచ దేశాలను తీవ్ర కన్నీళ్లు పెట్టించేలా ఉంది. గాజాలో నెలకొన్న పరిస్థితులపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్-డబ్ల్యూహెచ్‌ఓ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అల్ షిఫా ఆస్పత్రి శవాల నిలయంగా మారిందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రి ప్రాంగణంలో అమానవీయ ఘటనలు జరుగుతున్నాయని డాక్టర్లు తెలిపారు. శవాలు కుళ్లిపోయి.. ఆ ప్రాంతం మొత్తం దుర్గంధం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గాజాలో ఉన్న అతి పెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫా ఆస్పత్రిని అడ్డుగా పెట్టుకొని హమాస్ ఉగ్రవాదులు తమను రక్షించుకుంటున్నారని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది. దీంతో ఆ ఆస్పత్రిని మొత్తాన్ని చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైనికులు.. దాన్ని దిగ్భందించారు. ఈ క్రమంలోనే గత వారం 72 గంటల పాటు అల్ షిఫా ఆస్పత్రికి కరెంట్, నీరు, ఆహారం సరఫరా చేయకుండా నిలిపివేసింది. బయట నుంచి ఇజ్రాయెల్ సైనికులు భీకరమైన కాల్పులు చేయడంతో ఆస్పత్రి చుట్టూ భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తప్పని పరిస్థితుల్లో ఆస్పత్రి ప్రాంగణంలోనే చనిపోయిన వారిని ఖననం చేయాల్సి వస్తోందని అధికారులు తెలిపారు.