నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైయస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైయస్ఆర్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర రెండో దశ బుధవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, గుంటూరు జిల్లా పొన్నూరు, శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గాల్లో బుధవారం యాత్ర జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కదలి రావడంతో మూడు నియోజకవర్గాల్లో యాత్ర విజయవంతమైంది. సంక్షేమ పథకాల ద్వారా సీఎం వైయస్ జగన్ చేసిన మేలును, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు–పవన్ చేసిన మోసాలను నేతలు సభల్లో వివరిస్తున్నప్పుడు ‘ఆపు బాబూ నాటకం.. జగనే మా నమ్మకం’ అంటూ ప్రజలు ప్రతిస్పందించారు. కుటుంబం, గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్లాలంటే వైయస్ జగన్‌నే మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నేతలు పిలుపునిచ్చినప్పుడు.. ‘జగనే కావాలి.. జగనే రావాలి’ అంటూ ప్రజలు పెద్ద ఎత్తు నినదించారు. గురువారం విజయనగరం జిల్లా రాజాం, అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గాల్లో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది.