హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిని ఎమ్మెల్యే బాలకృష్ణ నేడు సందర్శించారు. టీడీపీ-జనసేన నియోజవకర్గ స్థాయిలో సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత హిందూపురం ఆస్పత్రిని సందర్శించి.. ఆస్పత్రిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని బాలకృష్ణకు ఫిర్యాదు చేశారు రోగులు.. దీంతో.. ఆస్పత్రి సూపరింటెండెంట్ ను నిలదీశారు బాలయ్య..
అనంతరం ఆయన మాట్లాడుతూ.. హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో అనేక సమస్యలు ఉన్నాయి. వైద్య పరికరాలు లేవు, ఉన్న వాటిని వాడుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బాలయ్య.. గతంలో నేను ఇచ్చిన వెంటిలేటర్లు కూడా నిరుపయోగంగా ఉన్నాయన్నారు. అయితే, గత టీడీపీ ప్రభుత్వం హయాంలో హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి శుభ్రంగా ఉండేది.. ఇప్పుడు అలా లేదన్నారు. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు అంటున్నాయి.. ఉన్న ఆస్పత్రిలో సౌకర్యాలు కలిపిస్తే.. అసలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు కదా? అని ప్రశ్నించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద ఇచ్చిన నిధులను కూడా వేరే స్కీమ్ లకు డైవర్ట్ చేశారని ఆరోపించారు.. 460 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం వేరే స్కీమ్ లకు తరలించింది.. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఫైన్ కూడా కట్టిందన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.