కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద మహిళలకు నెల నెల రూ.2 వేలు అందజేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ పథకాన్ని ప్రముఖ దేవీ ఆలయానికి ఈ పథకం వర్తింపజేసింది కర్ణాటక సర్కారు. మైసూరులోని చాముండశ్వరీ అమ్మవారి ఆలయానికి గృహలక్ష్మి పథకం వర్తింపజేస్తూ ఆదేశాలు వెలువరించింది. దీంతో చాముండేశ్వరీ మాత ఆలయ ఖాతాకు ప్రతి నెలా తొలుత డబ్బు జమ చేస్తారు. అనంతరం రాష్ట్రంలోని మిగతా మహిళల ఖాతాల్లోకి నగదు జమ కానుంది.
'గృహ లక్ష్మి పథకం అమ్మవారికి అందజేయాలని కోరుతూ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ దినేశ్ గూలిగౌడ ఇటీవలే లేఖ రాశారు. తాజాగా, తన ప్రతిపాదనకు డీకే అంగీకారం తెలిపినట్లు దినేశ్ వెల్లడించారు. నెల నెలా రూ.2 వేలను చాముండేశ్వరి ఆలయ ఖాతాలో జమ చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌ను డిప్యూటీ సీఎం ఆదేశించినట్లు చెప్పారు. కాగా, గత ఆగస్టు 30 న మైసూరు కోటలోని చాముండేశ్వరి ఆలయంలో రూ.2,000 దక్షిణగా సమర్పించిన అనంతరం గృహలక్ష్మి పథకాన్ని సిద్ధ రామయ్య ప్రభుత్వం ప్రారంభించింది.
దీనిని అమ్మవారికి అంకితం చేస్తూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఈ పథకాన్ని విజయవంతం చేయాలని ప్రార్థించారు.ఈ పథకం కింద రాష్ట్రంలోని 1.2 కోట్ల మంది మహిళలకు ప్రతి నెలా రూ.2 వేల జమ చేస్తోంది. తాజాగా, అమ్మవారికి కూడా ఈ పథకం వర్తింపజేయడం గమనార్హం. కాగా, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతోన్న ఐదు రాష్ట్రాల్లోనూ తాము అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని అమలుచేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అంతేకాదు, దీనిని సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకునే యోచనలో ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా గృహలక్ష్మి పథకాన్ని అమలుచేస్తామని ప్రకటించారు.
గ్యారెంటీ పథకాలు ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తాయని ప్రధాని మోదీ సహా బీజేపీ నేతల విమర్శలకు గట్టిగా సమాధానం ఇచ్చేలా.. కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు పట్టువదలకుండా ఒక్కో పథకాన్ని పట్టాలెక్కించింది. ఐదు గ్యారెంటీల్లో మూడింటిని అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లో ప్రారంభించింది. కీలకమైన ‘గృహలక్ష్మి’ పథకానికి మాత్రం కొంత సమయం తీసుకుంది. లబ్దిదారుల ఎంపిక సహా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంది. పకడ్బంధీగా పథకం అమలు చేయాలనే ఉద్దేశంతో ఆగస్టు 30న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో పథకానికి శ్రీకారం చుట్టింది. జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం దక్కేలా ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa