గాజాలో ఘర్షణల నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో తలెత్తిన పరిస్థితులతోపాటు కొత్తగా ఆవిర్భవిస్తున్న సవాళ్లను పరిష్కరించడానికి ఏకాభిప్రాయాన్ని సాధించాలని ప్రధాని నరేంద్ర మోడీ వర్ధమాన దేశాల నేతలకు విజ్ఞప్తి చేశారు. రెండవ ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్’ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. శుక్రవారం ఈ సదస్సును ప్రారంభిస్తూ మోడీ ప్రసంగించారు. గాజాలో జరుగుతున్న యుద్ధంలో అమాయకులైన ప్రజలు మరణించడాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పరిస్థితులను సంయమనంతో ఎదుర్కొనాలని, దానితోపాటు చర్చలు, దౌత్యం కూడా అవసరమని ఆయన నొక్కి చెప్పారు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తో మాట్లాడిన తర్వాత భారత్ కూడా మానవతా సాయం పంపిందని చెప్పారు.
మరింత విస్తృతమైన మంచి, ప్రయోజనాల కోసం వర్ధమాన దేశాలన్నీ ఒకే వాణిని వినిపించాలని ఆయన కోరారు. ‘సంప్రదింపులు, సహకారం, కమ్యూనికేషన్, సృజనాత్మకత, సామర్ధ్యాల రూపకల్పన” వంటి సూత్రాలను అనుసరించడం ద్వారా ”ఒక భూగోళం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు” అన్న భారత్ నేతృత్వంలోని జి-20 థీమ్ కోసం అందరమూ కృషి చేయాలని అన్నారు. అక్టోబరు 7న ఇజ్రాయిల్‌పై హమస్ జరిపిన ఆకస్మిక దాడులను భారత్ వెంటనే ఖండించింది. తీవ్రవవాద చర్య అంటూ ముద్ర కూడా వేసింది. గాజాలోని ఆస్పత్రిపై జరిగిన క్షిపణి దాడిలో 500మందికి పైగా మరణించిన ఘటనను కూడా భారత్ తీవ్రంగా ఖండించింది.
ఘర్షణలు, యుద్ధాల్లో పౌరులు బలి కాకూడదని, వారి ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకత వుందని మోడీ పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్‌లోని పలు దేశాలు కూడా ఇజ్రాయిల్ చర్యను తీవ్రంగా ఖండించాయి. చిలీ, కొలంబియా, హోండూరస్ దేశాల అధ్యక్షులు ఇజ్రాయిల్ ప్రతిస్పందిస్తున్న తీరును తీవ్రంగా గర్హించారు. గాజాలో మానవాళికి వ్యతిరేకంగా ఘోరమైన దారుణాలు, నేరాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. పలు ఆఫ్రికా దేశాలు కూడా ఇజ్రాయిల్‌ను విమర్శించాయి. తక్షణమే అంతర్జాతీయ సమాజం స్పందించి, చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పాయి.