రష్యా అభివృద్ధి చేసిన మీర్ చెల్లింపుల వ్యవస్థను వెనిజులాలో ప్రవేశపెట్టినట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి వైవాన్ గిల్ పింటో ప్రకటించారు. జాతీయ చెల్లింపుల వ్యవస్థలో చేరతాని ఏడాది క్రితం రష్యా ప్రకటించింది. తాజా నిర్ణయంతో ఇది వాస్తవ రూపం దాల్చింది. యావత్ వెనిజులాలో చెల్లింపులు జరపటానికి మీర్ ప్లాట్ ఫాం అనుమతించింది. వెనిజులా చెల్లింపుల్లో 36శాతం మీర్ కార్డుల ద్వారా జరుగుతాయనిరష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రొవ్‌తో చర్చించిన అనంతరం పింటో ప్రకటించారు.
వెనిజుయేలా లోని 80000ఏటీటిఎమ్‌లలో మీర్ చెల్లింపుల పద్దతి అమలవుతుందని అక్టోబర్‌లో రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నొవాక్ చెప్పాడు. వెనిజులాలో ఇలా మీర్ కార్డులను తన చెల్లింపులకు వాడుకోవటం ద్వారా ఇరు దేశాలు తమతమ దేశాల జాతీయ కరెన్సీల్లో చెల్లింపులు జరుపుతున్నాయి. గత సంవత్సరం నుంచి మీర్ కార్డుల వినియోగం బాగా పెరిగి కొత్త కార్డులకు డిమాండ్ ఏర్పడింది. మీర్ కార్డుల చెల్లింపుల వ్యవస్థను ప్రపంచ వ్యాప్తంగా పది దేశాలు అమలు చేస్తున్నాయి. మరో 15దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. మార్చి నెలలో పశ్చిమ దేశాల చెల్లింపుల కార్డులకు ప్రత్యామ్నాయంగా రష్యాకు చెందిన మీర్ కార్డుల వ్యవస్థను క్యూబా ప్రవేశపెట్టింది. క్యూబాలో ఏటీఎమ్‌లు మీర్ కార్డుల లోగోను ప్రదర్శిస్తున్నాయి.
రష్యా, వెనిజులా దేశాలు వాణిజ్యంలో తమతమ దేశాల జాతీయ కరెన్సీల్లో చెల్లింపులు జరుపుతూ డాలర్ చెల్లింపుల వ్యవస్థ నుంచి బయటపడటానికి (డిడాలరైజేషన్) తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని వెనిజులా విదేశాంగ మంత్రి పింటో ప్రకటించాడు. ఈ మార్పుకు అవసరమైన సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఇరు దేశాల కేంద్ర బ్యాంకులు కృషి చేస్తున్నాయని కూడా పింటో ప్రకటించాడు. ఇరు దేశాల వాణిజ్యంలో త్వరలోనే తమతమ జాతీయ కరెన్సీల్లో చెల్లింపులు జరుగుతాయనీ, అమెరికా డాలర్‌ను ఉపయోగించవలసిన అవసరం లేకుండా చేస్తామని కూడా ఆయన అన్నాడు.