మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ముగిసింది. ఒకే విడతలో జరిగిన ఈ ఎన్నికల్లో 230 శాసనసభ నియోజకవర్గాలో 2,533 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 76.22శాతం పోలింగ్.. జరగడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి. 1956లో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ కావడం విశేషం. 2018లో జరిగిన ఎన్నికల్లో 75.63 శాతం పోలింగ్ నమోదైంది. తాజా ఎన్నికల్లో అత్యధికంగా సియోని జిల్లాలో 85.68శాతం ఓటింగ్ నమోదవ్వగా.. ఆదివాసీలు ఎక్కువగా ఉండే అలిరాజ్‌పుర్‌లో అత్యల్పంగా 60.10శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. నక్సల్స్ ప్రభావం ఉండే బాలాఘాట్ జిల్లాలో 85.23శాతం పోలింగ్ నమోదవ్వడం విశేషం.
ఈ మేరకు ఎన్నికల అధికారులు శనివారం వెల్లడించారు. మరోవైపు, ఎన్నికల వేళ అక్రమ నగదు ప్రవాహం కూడా విపరీతంగా పెరిగింది. గతంలో పోలిస్తే ఈసారి ఐదు రెట్లు ఎక్కువ నగదు, ఇతర వస్తువులను అధికారులు సీజ్ చేశారు. పెద్ద ఎత్తున నగదు స్వాధీనం.. ఇక, తాజా ఎన్నికల్లో లెక్కాపత్రం లేని నగదు, మద్యం, ఆభరణాలు తదితర వస్తువుల స్వాధీనం కూడా గతంలో పోలిస్తే గణనీయంగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో అక్టోబరు 9న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి శుక్రవారం వరకు చేపట్టిన తనిఖీల్లో రూ.340కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే సమయంలో (కోడ్ అమల్లో ఉన్న రోజుల్లో) రూ.72.93కోట్ల నగదు, ఇతర వస్తువులను అధికారులు సీజ్ చేశారు.
తాజా ఎన్నికల్లో ఆ మొత్తం దాదాపు ఐదు రెట్లు పెరగడం గమనార్హం. ఇక, తాజాగా స్వాధీనం చేసుకున్న వాటిల్లో రూ.40.18 కోట్ల నగదు ఉంది. రూ.65.56 కోట్ల విలువైన అక్రమ మద్యం, రూ.17.25 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న రూ.92.76 కోట్ల విలువైన బంగారం, వెండి వంటి ఖరీదైన ఆభరణాలు, రూ.124.18 కోట్ల విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనుపమ్ రంజన్ వెల్లడించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకు 41.02 శాతం, కాంగ్రెస్‌కు 40.89 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ109 స్థానాలనే గెలుచుకోగా.. కాంగ్రెస్ 114 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఏడాదికే ఆ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి మళ్లీ బీజేపీ సర్కారు వచ్చింది.