హమాస్ మిలిటెంట్లను అంతం చేయడానికి కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ ఇప్పటికే ఉత్తర గాజాపై భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో సామాన్య పౌరులు కూడా మృతి చెందుతున్నారు. ఆస్పత్రుల్లో కూడా ఇజ్రాయెల్ సైన్యం చొరబడింది. ఇక ఇప్పుడు యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలని భావిస్తున్న ఇజ్రాయెల్ .. దక్షిణ గాజాపై తన ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే దక్షిణ గాజా నుంచి పాలస్తీనీయులంతా పశ్చిమానికి పారిపోవాలని హెచ్చరించింది.
త్వరలోనే దక్షిణ గాజాపై ముమ్మర దాడులు చేస్తామని.. ప్రాణాలతో బతికి బట్టకట్టాలంటే పశ్చిమ ప్రాంతానికి వెళ్లాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ఇది సులభం కాదని మాకు తెలిసినా.. ఎదురుకాల్పుల్లో పౌరులు మరణించకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. అని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. అయితే దక్షిణ గాజా నగరమైన ఖాన్ యూనిస్‌లో దాదాపు 4 లక్షల జనాభా ఉంటారు. వీరితో పాటు ఇటీవల ఉత్తర గాజా నుంచి చాలా మంది తరలివచ్చారు. ఇప్పుడు వీరంతా పశ్చిమ ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. మానవతా సాయం పొందేందుకు మళ్లీ వలస బాట తప్పదని గాజా పౌరులు వాపోతున్నారు.