ఉత్తరాంధ్ర ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాశీ (వారణాశి) రైలు ఎట్టకేలకు ఈ నెల 22 నుంచి పట్టాలెక్కనుంది. ప్రస్తుతం సంబల్‌పూర్-బెనారస్-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌గా నడుస్తున్న రైలును విశాఖపట్నం వరకూ పొడిగించునున్నారు. ఇది దక్షిణ ఒడిశావారికి కూడా ఉపయోగపడుతుంది. ఈ రైలు విశాఖ నుంచి బలంగిర్, టిట్లాఘర్, రాయగడ మీదుగా వెళుతుంది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ రైలును ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు సంబల్‌పూర్‌లో జెండా ఊపి ప్రారంభించనున్నారు.
బెనారస్-విశాఖపట్నం (నంబర్ 18311 నంబర్) రైలు విశాఖపట్నం నుంచి ప్రతి బుధ, ఆదివారాల్లో ఉదయం 4.20 గంటలకు బయలుదేరుతుంది. మరుసటిరోజు ఉదయం 9.25 గంటలకు బనారస్ చేరుతుంది. ఈ నెల 22 నుంచి ఈ రైలు ప్రారంభమవుతుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో 18312 నంబరుతో ప్రతి గురు, సోమవారాల్లో మధ్యాహ్నం మూడు గంటలకు బెనారస్‌లో బయలుదేరి మరుసటిరోజు రాత్రి 7.30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది.
సంబల్‌పూర్-విశాఖపట్నం మధ్యలో బర్గార్ రోడ్, బాలంగిర్, టిట్లాఘర్, కెసింగ, మునిగుడ, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలసల్లో ఆగుతుంది. ఇందులో సెకండ్ ఏసీ కోచ్-1, థర్డ్ ఏసీ కోచ్‌లు -4, స్లీపర్ క్లాస్ కోచ్‌లు-8, జనరల్ సెకండ్ క్లాస్-6, సెకండ్ క్లాస్ కమ్ దివ్యాంగుల కోచ్-1 ఉంటాయి. ఈ రైలు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలలో మారుమూల జిల్లాల ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది అంటున్నారు. దీనదయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, హటియా, రాంచీ, రూర్కెల, ఝార్సుగుడ, సంబల్‌పూర్ ప్రాంతాలను కనెక్టివ్‌గా ఉంటుంది అంటున్నారు.