ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ సభ్యత్వానికి, పదవికి బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మైదుకూరుకు చెందిన చిలమల ఓబయ్య రాజీనామా చేశారు. పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు స్థానం లేదని తెలుసుకున్నాను అన్నారు. తాను దివంగత వైఎస్సార్‌పై అభిమానంతో 20సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని.. ఆయన మరణానంతరం వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు. 2014లో మైదుకూరు మున్సిపాలిటీకి తాను పోటీ చేయాలని ప్రస్తుత సీఎం జగన్ స్వయంగా చెప్పారన్నారు.
తాను వైఎస్సార్‌సీపీలో తొలి నుంచీ ఉన్నాన.. 2014లో మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ పదవిని తన కుమారుడికి ఇస్తానని చెప్పిన ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మోసం చేశారన్నారు. వైఎస్సార్‌సీపీలో ఉంటూ భూములు, ఆస్తులు పోగొట్టుకుని రోడ్డునపడ్డానన్నారు. న్యాయం చేయాలని భార్యాభర్తలిద్దరం ఎంపీ అవినాష్ కాళ్లు పట్టుకున్నా కరుణించలేదన్నారు. గత ఎన్నికల సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి తనను పిలిపించి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చే వరకు వేచి ఉంటే తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు.
అధికారంలోకి వచ్చాక రెండుసార్లు సీఎం జగన్ వద్దకు వెళ్లామన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో తమకు న్యాయం జరగలేదన్నారు. కడప ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌ను కలిసి న్యాయం చేయాలని కోరగా.. స్పందించిన ఆయన పక్కనే ఉన్న కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి చెప్పి న్యాయం జరిగేలా చూడాలని సూచించారన్నారు. ఆ మేరకు దాదాపు 100 సార్లు ఎంపీని కలిసి న్యాయం చేయాలని కోరానన్నారు. ఆయన కాళ్లు పట్టుకుని బతిమాలినా ఇంతవరకూ కనికరించలేదన్నారు.
ఇటీవల మైదుకూరు మున్సిపాలిటీలో పనులకు టెండర్లు వేయగా వాటినీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి రద్దు చేయించి వెళ్లి జగన్‌మోహన్‌రెడ్డికి చెప్పుకో అని నిర్లక్ష్యంగా మాట్లాడారన్నారు. ఈ విషయాలను ప్రభుత్వ సలహాదారు సజ్జల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకిచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. తాము తీవ్ర మనస్తాపానికి లోనై పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నామన్నారు ఓబయ్య. రాజీనామా పత్రాన్ని వైఎస్సార్‌సీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబుకు అందజేస్తానన్నారు.
ఓబయ్య కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటుగా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తనను మోసం చేశారని ప్రధానంగా ఆరోపణలు చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేయడంపై వైఎస్సార్‌సీపీ నేతలు స్పందించాల్సి ఉంది. మైదుకూరు నియోజకవర్గానికి చెందిన ఓబయ్య ప్రస్తుతం బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో బీసీ నేత చేసిన ఆరోపణలు చర్చనీయాంశం అయ్యాయి.