తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. దర్శన టికెట్లు, సేవలు, వసతి గదులు ఆన్‌లైన్‌లో షెడ్యూల్ ప్రకారం విడుదలవుతున్నాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. భక్తులు 18 నుంచి 20వ తేదీ వరకు అర్చన, అష్టదళపాదపద్మారాధన, సుప్రభాతం, తోమాల వంటి ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ. ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు డిప్‌లో టికెట్లు పొందిన వాళ్లు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని ఖరారు చేస్తారు.
ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు (కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ) టికెట్లను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు టీడీడీ విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారి దర్శనంతో కూడిన వర్చువల్ ఆర్జిత (కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ) సేవలకు సంబంధించిన టికెట్లను ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి.. తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణం టికెట్లను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవాణి, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లను ఈ నెల 23నే విడుదల చేసే అవకాశం ఉంది. అంతేకాదు టీటీడీ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ.300/- దర్శన టికెట్ల కోటాను 24న, తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేయనున్నారు.. ఈ షెడ్యూల్ ప్రకారం భక్తులు సేవా టికెట్లు, దర్శన టికెట్, వసతి గదుల్ని బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. అంతేకాదు ఒకవేళ సేవ, దర్శన టికెట్ల విడుదల తేదీ ఆదివారం వస్తే.. వాటిని మరుసటి రోజు విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది.
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి పంచమీతీర్థం సందర్భంగా శనివారం వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు.. మళ్లింపులు చేశారు. శనివారం ఉదయం అమ్మవారి చక్రస్నానం పూర్తయ్యే వరకు తిరుచానూరు లోపలకి, బయటకు వాహనాలను పంపరు. తిరుపతి నుంచి వచ్చే భక్తులు నాలుగు చక్రాల వాహనాలను మార్కెట్ యార్డు, తనపల్లి క్రాస్ వద్ద పార్కింగ్ చేయాలి.. బైక్‌లు శిల్పారామం, వార్త క్రాస్ వద్ద పార్కింగ్ చేసి నవజీవన్ హాస్పిటల్ వద్ద ఉన్న హోల్డింగ్ పాయింట్ ద్వారా వెళ్లాలి. రేణిగుంట, గాజులమండ్యం నుంచి వచ్చే భక్తులు వార్త క్రాస్ వద్ద పార్కింగ్ చేయాలి. తమిళనాడు నుంచి వచ్చే భక్తులు పాడిపేట వద్ద వాహనాలు పార్కింగ్ చేసి.. గోశాల పాయింట్ నుంచి పుష్కరిణిలోకి రావాలి. చిత్తూరు నుంచి వచ్చే భక్తులు తనపల్లి క్రాస్ వద్ద పార్కింగ్ చేసి కాలినడకన నవజీవన్ వద్దకు వచ్చి క్యూలో ప్రవేశించాలి. పూడి మార్గం నుంచి వచ్చేవారు ముండ్లపూడి మీదుగా తనపల్లికి రావాలి. తిరుపతి రూరల్ ప్రజల తాజ్ హోటల్ మార్గం ద్వారా తిరుపతి వైపు రావాల్సి ఉంటుంది.