వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుఫాన్‌గా బలపడింది. శుక్రవారం రాత్రి బంగ్లాదేశ్ తీరంలో ఖేపుపరాకు సమీపంలో తుఫాన్ తీరం దాటిందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారానికి ఈ తుఫాన్ బలహీనపడుతుందన్నారు. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కి.మీల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు. దక్షిణ అండమాన్ వద్ద సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఏపీలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. తుఫాన్ ప్రభావం ఏపీపై పెద్దగా కనిపించలేదు. అయితే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురుస్తాయని భావిస్తున్నారు.
ఏపీలో రైతులు వర్షాలు పడతాయని ఆందోళనలో ఉన్నారు. అయితు తుఫాన్ ముప్పు తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని జిల్లాల్లో వరిపంట కోతకు వచ్చింది.. మరికొన్ని చోట్ల వరి కోతలు ముగియగా.. పొలాల్లో కుప్పలు వేశారు. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు కూడా ముందుగానే అప్రమత్తం చేయడంతో జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే తుఫాన్ ముప్పు లేకపోవడంతో హమ్మయ్యా అనుకున్నారు. అయితే తేలికపాటి జల్లులు కురుస్తాయంటున్నా.. పెద్దగా ఇబ్బంది లేదంటున్నారు. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు.
వర్షాల సంగతి అలా ఉంటే.. పగటిపూట ఎండ, రాత్రిళ్లు చలివాతావరణంతో జనాలు అల్లాడిపోతునన్నారు. రాత్రి నుంచి ఉదయం 8 గంటల వరకు చలి వాతావరణం ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కూడా కురుస్తోంది. ఈ విచిత్రమైన వాతావరణంతో జనాలు కాస్త ఇబ్బందిపడుతున్నారు. మొత్తానికి ఏపీలో విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.