బంగాళాఖాతంలో ఏర్పడిన మిథిలి తుఫాను బంగ్లాదేశ్ వద్ద శుక్రవారం రాత్రి తీరం దాటిన విషయం తెలిసిందే. ఇది క్రమంగా బలహీనపడి.. వాయుగుండంగా మారింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో శనివారం పొడి వాతావరణం నెలకొంది. దీంతో ఎండ తీవ్రత పెరిగింది. రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని సూచించింది.
అయితే, ఆగ్నేయ బంగాళాఖాతం.. దానికి ఆనుకుని అండమాన్ సముద్రం.. ఇంకా శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినట్టు పేర్కొంది. వీటి ప్రభావంతో నవంబరు 20 నుంచి తూర్పుగాలులు బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న దక్షిణ కోస్తా, 21 నుంచి 23 వరకు కోస్తాలోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే, కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో యానాంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల సాధారణ వర్షాలు పడతాయని తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, సరిహద్దు శ్రీలంక ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఆవర్తనం విస్తరించింది.. దీనికి అనుబంధంగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఉత్తర త్రిపుర పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనానికి సమాంతరంగా ఏర్పడిన ఇది కూడా సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో విస్తరించిందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, పక్కనే ఉన్న యానాంలోని దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని తెలిపింది.