మన దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ గత నెలలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం ఎన్నికలు విడతల వారీగా పూర్తయ్యాయి.
ఇక మిగిలింది రాజస్థాన్, తెలంగాణలో మాత్రమే. రాజస్థాన్‌లో ఇప్పటికే నవంబర్ 17న తొలివిడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక రెండు విడతల్లో అనగా.. నవంబర్ 23, 30 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ హామీల వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
'రాజస్థాన్‌లో కాంగ్రెస్ గాలి బాగా వీస్తోంది అని ప్రగల్భాలు పలుకుతున్నారు ఆ పార్టీ నాయకులు. అయితే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బహిరంగ సభల్లో జనం ఎందుకు రావడం లేదు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గడిచిన ఐదేళ్ల పాలనలో మొద్దు నిద్ర పోయిందని.. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఇప్పుడు ఏదో ఒక మాయమాటలు చెప్పి అలజడి సృష్టించాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆరోపించారు. అలాంటి వారిని తరిమి కొట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు గానూ 165 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని వారు చెప్పుకుంటున్నారు. అయితే వారికి కేవలం 65 స్థానాలు వచ్చినా సన్మానం చేస్తానని ఎద్దేవా చేశారు. ప్రజలు కాంగ్రెస్ తప్పుడు హామీలు, అక్రమాలను ప్రజలు గుర్తుపెట్టుకున్నారని రాబోయే ఎన్నికల్లో తమ ఓటు ద్వారా తగిన బుద్ది చెబుతార'ని తెలిపారు.