ప్రకాశం జిల్లాలో ఓ లారీ కోసం అధికారుల సినిమా రేంజ్‌లో ఛేజింగ్ సీన్ కనిపించింది. తమిళనాడు వైపు నుంచి లోడ్‌తో వెళుతున్న ఓ లారీని టాస్క్‌ఫోర్స్ అధికారుల కళ్లు గప్పి తప్పించుకుని ఆంధ్రలోకి వచ్చింది. ప్రకాశం జిల్లాలోకి రాగా ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. చెన్నైకు చెందిన 30మంది ఎర్ర చందనం దొంగలు ఆదివారం అక్కడి నుంచి తప్పించుకుని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వైపు వచ్చారు. వారి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెంబడించారు.
ఈ క్రమంలో సంతనూతలపాడు వైపు వారి లారీ దూసుకెళుతున్నట్లు సమాచారం అందుకుని స్థానిక పోలీసులనూ వారు అప్రమత్తం చేశారు. స్మగ్లర్లకు తేరుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అనూహ్యంగా దొంగల లారీ ముందు కారును వేగంగా తీసుకొచ్చి నిలపడంతో వారు అవాక్కయ్యారు. వారు కోలుకునే లోపు దాడిచేసి లారీలో ఉన్న కూలీల్ని పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి.. నిందితులను కొంతసేపు స్టేషన్‌లో ఉంచి, అనంతరం మరో ప్రాంతానికి తరలించారు. లారీ వెనుక కారు వందల కిలోమీటర్ల దూరం ఈ ఛేజింగ్ కొనసాగింది. మొత్తానికి సినిమా స్టైల్లో దొంగల్ని పట్టేశారు టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు.