ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు, వినియోగదారులకు కొరియర్, కార్గో ద్వారా మెరుగైన సేవలు అందించడంతోపాటు తక్కువ ఖర్చుతో వేగంగా పార్సిళ్లను డోర్ డెలివరీ వేస్తోందని ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ కార్గో ప్రచార మాసోత్సవాల్లో భాగంగా అరైవల్ బ్లాక్‌లోని కొరియర్, పార్సిల్ బుకింగ్ కార్యాలయం వద్ద వివిధ జిల్లాల ప్రజా రవాణా అధికారులకు స్వయంగా ఆయన పుస్తకాల పార్సిళ్లను బుక్ చేశారు. ప్రచార మాసోత్సవాల్లో కార్గో అభివృద్ధికి ప్రతి ఉద్యోగి తన వంతుగా కార్గో డోర్ డెలివరీ బుకింగ్‌లు చేయాలన్నారు. వారిలో స్ఫూర్తి నింపేందుకు తాను స్వయంగా డోర్ డెలివరీ కార్గో బుకింగ్స్ చేశానన్నారు. గతేడాది ఇదే మాసంలో రూ. 102.8 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 118.48 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.
ద్వారకాతిరుమలరావు 35 పుస్తకాలను కార్గో డోర్ డెలివరీ చేశారు. సంస్థ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచేందుకు తన వంతు బాధ్యతగా డోర్ డెలివరీకి ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకున్నట్లు తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీ కార్గో సేవలకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ వస్తోందని.. కార్గో సేవలను మరింత విస్తృత పరిచేందుకు కార్గో మాసోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. ప్రైవేట్ కొరియర్, పార్శిల్ సర్వీసుల కంటే అతి తక్కువ ధరలకే కార్గో సేవలు అందిస్తున్నామన్నారు. గత ఆరేళ్లుగా కార్గో రేట్లను కూడా పెంచలేదన్నారు. బస్సు టిక్కెట్ రేట్లు పెరిగినా కార్గో రేట్లను పెంచలేదని.. ఆదరణతో ఆదాయం పెరుగుతోందన్నారు.ఏపీతో పాటు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు వెళ్లే ఇతర రాష్ట్రాలకు కార్గో సేవలు అందిస్తున్నామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ తెలిపారు. ఈ ఆర్ధిక సంవత్సరం 200 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉద్యోగులంతా ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలని కోరారు. త్వరలోనే కార్గోలో ఎక్స్ ప్రెస్ సర్వీసు సేవలు పెట్టాలని భావిస్తున్నామన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ మాదిరి అతి తక్కువ ధరలకు కార్గో సేవలు ఎవరూ అందించడం లేదన్నారు.
ధరల విషయానికి వస్తే.. ఒక కేజీ పార్సిల్ కు డోర్ డెలివరీ ఛార్జీ రూ. 15, ఆరు కిలోల వరకు రూ. 30, పది కిలోల వరకు రూ. 36, 25 కిలోల వరకు రూ. 48, 25 కిలోల నుంచి 50 కిలోల వరకు రూ. 59గా నిర్ణయించినట్లు వివరించారు. పార్సిల్ కౌంటర్ (బస్టాండ్) నుంచి 10 కిలో మీటర్ల లోపు వారికే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాల కేంద్రాలతోపాటు 84 పట్టణాలలో కార్గో డోర్ డెలివరీ సేవలు విస్తరిస్తున్నట్లు ఆర్టీసీ గతంలో తెలిపింది.